adani issue in parliament : అమెరికా పరిశోధక సంస్థ హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదికతో అదానీ గ్రూపు షేర్లు తీవ్ర ఒడుదొడుకులకు గురయ్యాయి. ఈ కుంభకోణంపై దర్యాప్తు చేయాలని అటు పార్లమెంటులోనూ విపక్ష పార్టీలు ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. ప్రధాని మోదీ లోక్ సభలో ప్రసంగిస్తున్న సమయంలో విపక్షాల నినాదాలు చేశాయి. జేపీసీ వేయాలంటూ విపక్ష సభ్యుల నినాదాలు అందుకున్నాయి. అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలని విపక్ష సభ్యుల డిమాండ్ చేయడంతో కాసేపు సభలో గందరగోళం ఏర్పడింది. విపక్ష సభ్యుల నినాదాలతో కాసేపు ప్రధాని ప్రసంగానికి ఆటంకం కూడా ఏర్పడింది.
Walkout of BRS MPs from Lok Sabha అదానీ సంస్థల వ్యవహారంపై చర్చించాలంటూ లోక్‌సభ, రాజ్యసభల్లో నోటీసులు ఇస్తూ వస్తున్న బీఆర్ఎస్..... సభాపతులు చర్చను అనుమతించకపోవటంతో నిరసన బాట పడుతున్నారు. తాజాగా లోక్‌సభ నుంచి బీఆర్ఎస్ ఎంపీలు వాకౌట్ చేశారు. అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలని బీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. జేపీసీ వేయనందుకు నిరసనగా బీఆర్ఎస్ ఎంపీలు వాకౌట్ చేశారు.
ప్రభుత్వ తీరును నిరసిస్తూ.... పార్లమెంటు ఆవరణలో బీఆర్ఎస్, ఆప్ ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. బీఆర్ఎస్ పార్లమెంటరీ పక్ష నేత కేకే, లోక్‌సభాపక్ష నేత నామ నాగేశ్వరరావుతో కలిసి ఎంపీలు సురేశ్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి, మాలోత్ కవిత, బీబీ పాటిల్ సహా మిగతా ఎంపీలంతా నిరసన వ్యక్తం చేశారు. అదానీ వ్యవహారంపై జేపీసీ లేదంటే సీజేఐతో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ పార్లమెంటు సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. కేంద్రప్రభుత్వం స్పందించకపోవడంతో సభను బహిష్కరిస్తున్నట్లు ఎంపీలు వెల్లడించారు.