VRAs as Government Employees in Telangana : భూస్వామ్య వ్యవస్థకు చిహ్నాలుగా మిగిలిన.. వీఆర్ఏ వ్యవస్థను శాశ్వతంగా రద్దు చేస్తున్నామని.. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం మేరకు.. వారిని పేస్కేలుతో వివిధ ప్రభుత్వ శాఖల్లో విలీనం చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ధరణి ప్రవేశపెట్టిన తర్వాత.. వీఆర్‌ఏ వ్యవస్థ రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే వీఆర్‌ఏల వినతి, వారి సామాజిక, ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని, ఇతర ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు చేయాలని కేసీఆర్ నిర్ణయించారు.
KCR Good News to VRAS :ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు.. రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి నవీన్ మిత్తల్ జీవో 81 జారీ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా.. 20,555 మంది వీఆర్‌ఏలు పనిచేస్తున్నారు. వీరిలో నిరక్షరాస్యులు, ఏడో తరగతి, పదో తరగతి పాసైనవారు, ఇంటర్మీడియట్ వరకు మాత్రమే చదివినవారు, డిగ్రీ ఆపై ఉన్నత చదువులు చదివినవారు ఉన్నారు. 61 ఏళ్ల లోపు వయసున్న 16,758 మంది వీఆర్‌ఏల సేవలను క్రమబద్ధీకరించి.. వివిధ ప్రభుత్వశాఖల్లో ఉద్యోగులుగా నియమించనున్నారు.
VRAS Permanent as Government Employees :ఉద్యోగ విరమణ వయసు 61 ఏళ్లు దాటిన.. మరో 3,797 మంది కుమారులు లేదా కుమార్తెలకు వారి అర్హతలను బట్టి కారుణ్య నియామకాలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్హతల ఆధారంగా.. లోయర్ గ్రేడ్ సర్వీస్, రికార్డు అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల్లో.. వీఆర్‌ఏలను నియమించనున్నారు. పదోతరగతివరకు చదివినవారు 10,317 మంది ఉండగా.. వారిని లోయర్‌గ్రేడ్ సర్వీసుకు తీసుకోనున్నారు. ఇంటర్ వరకు చదివినవారు 2,761 మంది ఉండగా.. వారిని రికార్డు అసిస్టెంట్‌లుగా తీసుకోనున్నారు. డిగ్రీ, అంతకుమించి చదివిన వారు 3,608 మంది ఉండగా.. వారిని జూనియర్ అసిస్టెంట్‌లుగా తీసుకోనున్నట్టు.. ప్రభుత్వ ఉత్తర్వుల్లో వివరించారు.