ప్రాణం కన్నా ఏదీ ఎక్కువ కాదు. ఇది అందరూ ఏకీభవించే మాట. ఎందుకంటే ప్రాణముంటేనే కదా... దేన్నైనా సాధించేది... సంపాదించేది. ఈ మాటను నిజం చేస్తూ వ్యాపార సంఘాల ప్రతినిధులు సంపాదనకు విరామం ఇస్తున్నారు. కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతోన్న నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని పలు ప్రధాన మార్కెట్ల వ్యాపారులు వారం రోజుల పాటు బంద్ ప్రకటించుకున్నారు. బేగంబజార్, జనరల్ బజార్, ట్రూప్ బజార్, లాడ్ బజార్లలోని వ్యాపారస్థులు అందరూ స్వచ్ఛంద లాక్డౌన్ చేయాలని నిర్ణయించుకున్నారు.
గ్రేటర్ హైదరాబాద్లో కరోనా కేసులు తీవ్రంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో అత్యధిక భాగం జీహెచ్ఎంసీ పరిధిలోనే వెలుగు చూస్తున్నాయి. గ్రేటర్ తర్వాతి స్థానాల్లో రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలు ఉంటున్నాయి. వైరస్ వ్యాప్తి పెరగటం వల్ల వ్యాపార కేంద్రాలు మూసివేస్తున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల వ్యాపారులు ఇదే విధంగా ఆలోచిస్తున్నారు.
కుత్బుల్లాపూర్, షాపుర్నగర్ ప్రాంతాల్లో ఉండే అన్ని మార్కెట్లు ఆదివారం నుంచి, వచ్చే నెల 5వ తేదీ వరకు మూసివేయాలని నిర్ణయించారు. పాతబస్తీలోని పత్తర్ గట్టి, మలక్పేట్ వంటి ప్రాంతాల్లోని దుకణాలూ బంద్ చేయబోతున్నారు. వినియోగదారులు పెద్దసంఖ్యలో వస్తున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తి పెరిగే అవకాశం ఉందని... అందుకే ముందు జాగ్రత్త చర్యగా వ్యాపారాలు మూసేస్తున్నామని వ్యాపారస్థులు అంటున్నారు. అయితే ఎక్కువ రద్దీగా ఉండే ప్రాంతాల్లో గతంలో ప్రభుత్వం సూచించినట్లుగా సరిబేసి విధానాన్ని అమలు చేయాలా... లేక ఇతర ఎదైనా పద్ధతిని అనుసరించాలా అనే అంశంపై కూడా వ్యాపార వర్గాలు ఆలోచిస్తున్నాయి.
వైరస్ తీవ్రత ఇలాగే కొనసాగితే మరో వారం పాటు బంద్ పొడిగిస్తామని వ్యాపారులు అంటున్నారు. దుకాణాల వద్ద శానిటైజర్ ఏర్పాటు చేసి... ఎన్ని చర్యలు తీసకున్నా వైరస్ తీవ్రం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి :మూసీ సుందరీకరణకు ప్రణాళికలు రూపొందించండి: మంత్రి కేటీఆర్