తెలంగాణ

telangana

ETV Bharat / state

కార్గో హ్యాండ్లింగ్​లో విశాఖ పోర్టు రికార్డ్ - విశాఖ పోర్టు తాజా వార్తలు

మార్చితో పూర్తయిన ఆర్ధిక సంవత్సరంలో ఏపీలోని విశాఖపట్నం పోర్టు గతంలోని కార్గో హ్యాండ్లింగ్ రికార్డులను తిరగరాసింది. ఆ ఉత్సాహంలో ఈ యేడాది మరిన్ని లక్ష్యాలను నిర్దేశించుకుంటోంది. కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ ప్రపంచ వ్యాప్తంగా పోర్టుల కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నప్పటికీ.. దాన్ని అధిగమించేందుకు ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకునేందుకు సిద్దమవుతోంది.

vizag-port-record-in-cargo-handling-this-year
కార్గో హ్యాండ్లింగ్​లో విశాఖ పోర్టు రికార్డ్

By

Published : Apr 29, 2020, 2:40 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖపట్నం పోర్టు 2019-20 ఆర్ధిక సంవత్సరంలో 72.72 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గో హ్యాండ్లింగ్ చేసి సరికొత్త ఆల్ టైం రికార్డును నమోదు చేసింది. మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి 11.15 శాతం వృద్ది రేటుతో ఈ రికార్డును సృష్టించింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 65.30 మిలియన్ టన్నుల కార్గోని హ్యాండిల్ చేసిన విశాఖ పోర్టు ఈ ఏడాది 7.42 మిలియన్ టన్నుల కార్గోని దానికి జత చేయగలిగింది. దేశంలో కాండ్లా, పారదీప్ పోర్టుల తర్వాత స్థానంలో నిలిచింది. జవహర్​లాల్ నెహ్రూ, ముంబయి పోర్టులను అధిగమించి మూడో స్ధానాన్ని దక్కించుకుంది.

పోటీని తట్టుకుని నిలిచి

విశాఖ పోర్టుకు అత్యంత సమీపంలోనే ఉన్న గంగవరం పోర్టు నుంచి గట్టి పోటీ ఉంది. అలానే కృష్ణపట్నం నుంచి కూడా పోటీని తట్టుకుంటూ ఈ రికార్డును సాధించడం విశేషం. కొవిడ్ ప్రభావం వల్ల గడచిన అర్ధిక సంవత్సరంలో చివరి 3 నెలలు తీవ్రమైన ఆర్థిక మందగమనం ఏర్పడినా.. ఇంత వృద్ధి రేటు సాధించడం సమష్టి కృషి వల్లనే సాధ్యపడిందని పోర్టు ఛైర్మన్ రామ్మోహనరావు చెబుతున్నారు.

అన్నింటిలోనూ పురోగతి

గతేడాది విశాఖ పోర్టు క్రూడాయిల్ 18.92 మిలియన్ మెట్రిక్ టన్నులు, ఇనుము ముడిఖనిజం, పిల్లెట్​లు 14.39 మిలియన్ మెట్రిక్ టన్నులు, కొకింగ్ బొగ్గు 7.45 ఎంఎంటీలు, స్టీం కోల్ 9.27 ఎంఎంటీలు, 5.03 లక్షల కంటైనర్లను ఈ పోర్టు హ్యాండిల్ చేసింది. పెరుగుదల పరంగా గమనిస్తే ముడి ఇనుము రవాణాలో 41 శాతం, కొకింగ్ కోల్​లో 28 శాతం, క్రూడాయిల్​లో 16 శాతం, కంటైనర్లలో 12 శాతం పురోగతి సాధించింది.

నేపాల్ కంటైనర్ కార్గోను 42,550కి పెంచగలిగింది. గతేడాది ఈ సంఖ్య 16,292 మాత్రమే. కోల్​కతా కన్నా నేపాల్​కి విశాఖ పోర్టు దూరం. అయినా కూడా ఆ పోర్టును ఈ విషయంలో వెనక్కి నెట్టగలిగింది. 32.1 మిలియన్ టన్నుల రైల్వే ట్రాఫిక్ ను కూడా విశాఖ పోర్టు హ్యాండిల్ చేసి ఇందులో 16.7 శాతం పురోగతి సాధించింది. 198 కోట్ల రూపాయిలతో రెండు కొత్త బెర్తుల నిర్మాణం పూర్తి చేయగలిగింది.

ABOUT THE AUTHOR

...view details