తెలంగాణ

telangana

ETV Bharat / state

'విష వాయువును పీల్చడం వల్లే చనిపోయారు' - rr venkatpuram news

ఏపీలోని ఎల్​జీ పాలిమర్స్ ప్రమాదంలో.. విషవాయువు పీల్చి ఊపిరితిత్తులు విఫలమవడం వల్ల రక్తంలో ఆక్సిజన్‌ శాతం పడిపోయి... ఊపిరాడక మృతి చెందారని శవపరీక్షలనంతరం కేజీహెచ్ ఫోరెన్సిక్‌ వైద్యులు తెలిపారు.

vizag gas leak story
విష వాయువును పీల్చడం వల్లే చనిపోయారు

By

Published : May 10, 2020, 9:56 AM IST

ఆంధ్రప్రదేశ్​లోని ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమ పరిసర గ్రామాల వారిలో కొందరు విషవాయువును పీల్చడం వల్లే మరణించారని శవపరీక్షలో తేలింది. ఊపిరితిత్తులు విఫలమవడం వల్ల రక్తంలో ఆక్సిజన్‌ శాతం పడిపోయి, ఊపిరాడక ఉక్కిరిబిక్కిరై కన్నుమూశారని మృతదేహాలకు శవపరీక్షలు నిర్వహించిన విశాఖ కేజీహెచ్‌ ఫోరెన్సిక్‌ వైద్యులు డాక్టర్‌ వెంకటరమణ, డాక్టర్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. ఈ నెల 7వ తేదీ తెల్లవారుజామున స్టైరీన్‌ గ్యాస్‌ లీకవ్వడంతో 12 మంది మరణించారు. వీరిలో ఒకరికి విజయనగరం జిల్లా కొత్తవలస ఆరోగ్య కేంద్రంలోనూ, మిగతా 11 మందికి కేజీహెచ్‌లోనూ శవపరీక్షలు నిర్వహించి మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు.

కాలేయం, పిత్తాశయం, ఉదరం, మూత్రపిండాలు, రక్తం, ఊపిరితిత్తులపై స్టైరీన్‌ ప్రభావాన్ని అంచనా వేసేందుకు వాటి భాగాలను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపారు. అలాగే మెదడు నుంచి చిన్న ముక్కను సేకరించి కేజీహెచ్‌ పాథాలజీ విభాగానికి పంపినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జి.అర్జున ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. ఆయా పరీక్షల నివేదికలు మూడు నుంచి నాలుగు వారాల్లో వస్తాయన్నారు. మరణానికి దారితీసిన పరిస్థితులను పూర్తిస్థాయిలో తెలుసుకోవాలంటే ఈ అధ్యయనం అవసరమన్నారు.

మృతులకు కొవిడ్‌ పరీక్షలు

కొవిడ్‌ నిర్ధారణ కోసం 11 మంది మృతుల నోరు, ముక్కు నుంచి నుంచి నమూనాలను సేకరించి కేజీహెచ్‌లోని వైరాలజీ ల్యాబ్‌కు పంపారు. ఆయా పరీక్షల నివేదికలు ఆదివారం రానున్నాయి.

ఇవీచూడండి:కరోనా వ్యాక్సిన్ తయారీలో భారత్ బయోటెక్‌

ABOUT THE AUTHOR

...view details