రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వివేకానంద జయంతి వేడుకలు.. పాల్గొన్న మంత్రులు Vivekananda Jayanthi Celebrations: స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై విగ్రహానికి సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ లావునాగేశ్వరరావు పూలమాల వేసి నివాళులర్పించారు. హైదరాబాద్ రామకృష్ణ మఠంలో జ్యోతి ప్రజ్వలన చేసి జాతీయ యువజన దినోత్సవాన్ని ప్రారంభించారు. దేశ భవిష్యత్తు యువత భుజాలపై ఉందన్నారు.
'ఇక్కడ చాలామంది విద్యార్థులున్నారు. మీకో చిన్న విషయం చెప్తాను. మీరు ప్రశ్నించడం నేర్చుకోండి. బడిలో చెప్పిన విషయాల్ని గుడ్డిగా అనుసరించకండి. భిన్నంగా ఆలోచించండి. ప్రత్యామ్నాయాలు ఏమున్నాయో పరిశీలించండి. అప్పుడే మీలో విశ్లేషణాశక్తి పెరుగుతుంది. అంటే మీ గురువులను గౌరవించకూడదని చెప్పట్లేదు. కానీ ఏ విషయాన్నైనా సరే ప్రత్యేకకోణంలో చూడండి. అప్పుడు మాత్రమే మీరు మిగతా వారికన్నా భిన్నంగా ఆలోచించగలరు. ఆంధ్రప్రదేశ్‌లో 65% న్యాయాధికారులు మహిళలే. స్వామి వివేకానంద ఆశించినట్లు ఈ మేరకైనా స్త్రీ-పురుషుల మధ్య వైవిధ్యం సాధించగలగడం సంతోషకరం. చదువుల్లో మీరు ప్రతిభావంతులుగా ఎదగాలి. అది అసూయకు దారితీయకూడదు. ఎవరైనా ప్రతిభావంతులుగా ఉంటే.. మీరు పోటీపడి వారి స్థాయికి చేరుకునేందుకు యత్నించండి. అంతేకానీ వారిని కిందకు లాగకండి.'-జస్టిస్ లావు నాగేశ్వర్‌రావు, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి
వరంగల్ జిల్లా పర్వతగిరిలో రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. హైదరాబాద్ కోఠి ఇస్లామియా బజార్‌లో పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. వివేకానందుని విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని వివేక్ చౌక్‌లో వివేకానందుని విగ్రహనికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. భారతదేశాన్ని జాగృతం చేసిన వివేకానందుడు తన ఉపన్యాసాలతో అమెరికా, ఇంగ్లాండ్‌లకు యోగ, వేదాంతాల్ని పరిచయం చేశారని మంత్రి కొనియాడారు.
హైదరాబాద్ భాజపా రాష్ట్ర కార్యాలయంలో జరిగిన వేడుకల్లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ హాజరై వివేకానంద చిత్రపటానికి నివాళులు అర్పించారు. నా దేశం-నా భవిష్యత్తు అని పిలుపునిచ్చిన వివేకానంద స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని బన్సల్ పిలుపునిచ్చారు. శంషాబాద్‌లో స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వివేకానంద విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా తపస్ నూతన సంవత్సర కాలెండర్ ఆవిష్కరించారు. వివేకానంద జయంతి సందర్భంగా భాజపా నిజామాబాద్‌లో కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. భారతీయ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన ఘనుల్లో వివేకానంద అగ్రగణ్యుడని ఈ సందర్భంగా కొనియాడారు. ఆదిలాబాద్‌లో భాజపా జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్, యువజన నేత మనోజ్.. వివేకానంద చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో బీజేవైఎం ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహించారు.
ఇవీ చదవండి: