హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో మూడో రోజు ఏవియేషన్ షో సందదర్శకుల అనుమతివ్వడంతో కళకళలాడింది. మొదటి రెండు రోజులు వ్యాపార, వాణిజ్య ఒప్పందాలతో గడిచిన ఏవియేషన్ షో శని, ఆదివారాలు సాధారణ పౌరులకు అవకాశం కల్పించారు. విమానాశ్రయంలోకి ప్రవేశించాక రన్‌వేపై నిలిచిన విమానాలను.. బారికేడ్ అవతలి నుంచి చూసే అవకాశం కల్పిస్తున్నారు. దీంతో విమానాలను దగ్గరి నుంచి చూసే అవకాశం లేదని కొంతమంది నిరుత్సాహానికి గురవుతున్నారు. మరికొందరు విమానాలను ఇంత దగ్గరగా చూడటం సరికొత్త అనుభూతినిస్తోందని సంతోషం వ్యక్తంచేస్తున్నారు.
ఉదయం 9గంటల నుంచి పౌరులను లోపలికి అనుమతిస్తున్నారు. మధ్యాహ్నం 12గంటలకు, సాయంత్రం 4గంటలకు రెండు సార్లు సారంగ్ టీం ఆధ్వర్యంలో ఎయిర్ షో నిర్వహిస్తున్నారు. ఈ ఎయిర్ షో ఏవియేషన్ షోకే ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. తొలి రెండు రోజులు రోజుకు ఒకసారే ప్రదర్శించిన ఎయిర్ షోను సందర్శకుల కోసం రెండు సార్లు ప్రదర్శిస్తున్నారు. పిల్లలకు ఏవియేషన్ రంగంపై ఆసక్తి, భిన్నరకాల విమానాలపై అవగాహన కల్పించేందుకు ఏవియేషన్ దోహదపడుతుందని తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు.
తొలిరోజు పదిరకాల విమానాలు ప్రదర్శించగా.. ఇవాళ ఎంబ్రరర్, స్పైస్ జెట్ విమానాలు నిష్క్రమించాయి. ఎయిర్ బస్ ఏ-350 ఏవియేషన్ షో లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇవాళ ఏవియేషన్ షో భద్రతా ఏర్పాట్లను నగర సీపీ సీవీ ఆనంద్ పర్యవేక్షించారు. ఆయన పలు స్టాళ్లను సందర్శించి నిర్వాహకులతో మాట్లాడారు. ఆదివారం సెలవు రోజు కావటంతో పెద్ద సంఖ్యలో సందర్శకులు ప్రదర్శనను సందర్శించే అవకాశాలున్నాయి.
టికెట్ ధరలు ఇలా...ఒక వ్యక్తికి 590రూపాయలు ఉండగా.. కేవలం బారికేడ్ అవతలి నుంచి చూసే అవకాశం ఉంటుంది. మరింత దగ్గరకు వెళ్లాలంటే... రూ.2600 వెచ్చించి దగ్గరి నుంచి విమానాలను చూడొచ్చు.