ముందురోజు సాయంత్రం... అల్లారుముద్దుగా తన బుజ్జాయికి గోరు ముద్దలు తినిపించిన ఆ తల్లికి తెలియలేదు.. అదే తన బిడ్డ ముఖంలో కడసారి చూసే చిరునవ్వు అవుతుందని. ఈ ఆడపడుచుకు అర్థం కాలేదు... తన నుదుటి మీద సింధూరం ఇక ఉండదని.. ఇకపై తన బిడ్డలు తండ్రి ప్రేమకు ఇక నోచుకోలేరని... !!
కానీ, తెల్లారేసరికి విషాదం విషవాయువు రూపంలో కమ్మేసింది. తల్లులకు కడుపుకోత మిగులుస్తూ.. ఆడపడుచుల తాళి తెంపేస్తూ.. భవిష్యత్తు చిదిమేస్తూ.. కలలను కాలరాస్తూ... నల్లమబ్బులా ఆ ఊర్లనే కాదు, అక్కడి ప్రజల జీవితాలనూ కమ్మేసింది. ఇక ఎప్పటికీ వారి బతుకులు మునుపటిలా ఉండవన్న చేదునిజం... అందరి గుండెల్నీ మెలిపెడుతోంది.
భవిష్యత్ భయానకం
ఏపీ విశాఖ విషాద ఘటన... దేశాన్ని కదిలించింది. సామాన్య ప్రజల నుంచి ప్రథమ పౌరుడు వరకూ ప్రతి ఒక్కరూ స్పందించారు. ఈ ఘటనలో ఇబ్బంది పడినవారు కోలుకోవాలని కోరుకున్నారు. కానీ బాధితులు మాత్రం భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. అంతకుమించి ఏం చేయలేని దుస్థితి వారిది. ప్రమాదం జరిగి 5 రోజులు గడుస్తోంది. ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పింది. సంస్థ సైతం ఈ ఘటనకు బాధ్యత వహిస్తామని ప్రకటించింది. ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సాయంతో సహా ఏవీ బాధితుల్లో ధైర్యం నింపలేకపోతున్నాయి. ఎవరినీ కదిలించినా... గుండెల్లో భయం, కళ్లల్లో అంతులేని ఆవేదనే కనిపిస్తున్నాయి.
అంతటా భయం.. ఆందోళన
ప్రమాదం జరిగింది.. ప్రాణాలు పోయాయి.. మరి మిగిలిన వారు కోలుకున్నారా.. అంటే అవును అని చెప్పలేని పరిస్థితి. తెల్లవారుజామున ఉక్కిరిబిక్కిరి చేసిన స్టైరిన్ ఘోరంగా దెబ్బతీసింది. ఇక ఎప్పటికి మరిచిపోలేని రీతిలో ఆ వాయువు అవశేషాలను మనుషుల శరీరాల్లో, వారి మనుసుల్లో నింపేసింది. వాయువు ప్రభావంతో మతిస్థిమితం కోల్పోయినవారిలా రోడ్లపై పరిగెత్తిన ప్రజల మానసిక స్థితి ఎవరు బాగుచేయగలరు ? ఆయోమయంగా.. ఆందోళనగా ప్రాణాలు కాపాడుకోవటం కోసం... ప్రాణవాయువు కోసం పరిగెత్తారు. కళ్లు కనిపించక, పక్కనున్న బావిలో, మురికికాల్వలో పడి ప్రాణాలు కోల్పోయిన ఘటన కళ్లు చెమర్చేలా చేసింది. ఆ కుటుంబాలకు తీరని శోకం మిగిల్చింది. తామేం తప్పు చేశామని... ఇంత పెద్ద శిక్ష అనుభవిస్తున్నామో తెలియక అల్లాడుతున్నారు.
ఊరిని వదిలి..
మామూలుగా ప్రకృతి ప్రకోపానికో .. అనుకోని ప్రమాదానికో.. ఊరు వదిలిపోతారు. కానీ ఇక్కడ ఓ సంస్థ చేసిన నిర్లక్ష్యానికి ఆ గ్రామాల వారు సొంతూళ్లను వదిలిపెట్టాల్సి వచ్చింది. బాధతో బరువెక్కిన హృదయాలతో ఉన్న ఇంటిని, వస్తువులను, ప్రమాదంలో అసువులు బాసిన మూగజీవాలను వదిలివెళ్లారు. కట్టుబట్టలతో ఆశ్రయం కోసం బంధువుల ఇళ్లలో తలదాచుకునేందుకు బిక్కుబిక్కుమంటూ వెళ్లిన వైనం అక్కడి పరిస్థితి తీవ్రతకు అద్దం పట్టింది. గ్రామాలను పూర్తిగా శుభ్రం చేశామని రెండు రోజుల తర్వాత సొంతూళ్లకు రండి.. అని అధికారులు చెప్పటమే కాదు, ఏకంగా ప్రజాప్రతినిధులు వారికి భరోసాగా ఆ ఊళ్లల్లోనే నిద్రించాల్సి వచ్చిందంటే.. ఈ ఘటన అక్కడి అక్కిడివారిని ఎంతగా భయపెట్టి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
మళ్లీ జరిగితే...
ఇప్పటికి వైద్యంతో కొన్ని ఇబ్బందులు తొలిగినా... దీర్ఘకాలికంగా అనేక సమస్యలు వెంటాడుతాయన్న నిజాలు వారిని మరింత కుంగదీస్తున్నాయి. ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలు చాలాకాలం వెంటాడుతున్నాయంటున్నారు నిపుణులు. ఆస్పత్రుల నుంచి ఇప్పుడు డిశ్చార్జ్ చేసినా... విషవాయువుతో నిండిన తమ ఇళ్లల్లోకి పోయి ఎలా ఉండాలంటున్నారు బాధితులు. ఇప్పుడిచ్చిన పరిహారం ముఖ్యం కాదని, భవిష్యత్తులో అనేక ప్రమాదాలు వచ్చే అవకాశం ఉన్నందున... తమకు లైఫ్ ఇన్సూరెన్స్ కావాలని డిమాండ్ చేస్తున్నారు.
సర్వస్వం కోల్పోయిన వారికి ఆర్థికంగా చేయూతనిస్తున్నా... ఆరోగ్యాలపై మాత్రం భరోసా ఇవ్వలేకపోతున్నారు. ముఖ్యంగా తీవ్రప్రభావం పడిన చిన్నారులకు భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు రావని ఎవరూ చెప్పలేకపోతున్నారు. విషవాయువు ప్రభావంతో సొంతూళ్లు వదిలి వెళ్లిపోయిన ప్రజలు ఇప్పటికీ తిరిగి రావటానికి జంకుతున్నారు. పెద్దఎత్తున వెలువడిన విషవాయువు ప్రమాదకరంగా వచ్చిందే.. అయితే, ఇటువంటి ప్రమాదం మరోసారి జరిగితే ఏంటన్న భయమే వారిలో గుబులు పుట్టిస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన పరిహారం.. అధికారులు ఇచ్చిన ఓదార్పు ఇవేమీ బాధితుల్లో భరోసా నింపలేకున్నాయి. మొన్న జరిగిన ప్రమాదం వారి ఉనికినే ప్రశ్నార్థకం చేసింది. భవిష్యత్తులో తమకేం కాదంటూ బాధ్యతగా వారి బాధలను పట్టించుకునేదెవరు. ప్రభుత్వమా.... ఆ పరిశ్రమా ?
ఇవీ చూడండి:పోతిరెడ్డిపాడు నీటి విషయంలో రేపు భాజపా నిరసన