తెలంగాణ

telangana

ETV Bharat / state

విశాఖ విష వాయువు బాధితులకు కొత్త సమస్యలు - విశాఖలో గ్యాస్ లీక్ న్యూస్

ఆంధ్రప్రదేశ్​లో విశాఖ వాయు విషాదం వెంటాడుతూనే ఉంది. గురువారం ఎల్​జీ పాలిమర్స్ నుంచి విషవాయువు లీకై 12 మంది మరణించగా.. అనేక మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే విషవాయువు పీల్చి అస్వస్థతకు గురైన వారికి ఇప్పుడు కొత్త సమస్యలు వస్తున్నాయి. 554 మంది బాధితుల్లో 52 మంది చిన్నారులు ఉన్నారు. తాజాగా బాధితుల్లో శరీరం కమిలి పోతుండగా, కొందరికి ఒంటిపై బొబ్బలు వస్తున్నాయి. మరికొందరు చిన్నారులకు న్యూమోనియా, జ్వరం వంటి లక్షణాలు బయటపడటం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది.

విశాఖలో విష వాయువు బాధితులకు కొత్త సమస్యలు
విశాఖలో విష వాయువు బాధితులకు కొత్త సమస్యలు

By

Published : May 9, 2020, 8:17 PM IST

ఏపీలోని విశాఖలో విష వాయువును పీల్చి అస్వస్థతకు గురై కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితులను ఇతర వ్యాధులు చుట్టుముడుతున్నాయి. ఆర్‌ఆర్‌ వెంకటాపురానికి చెందిన ఆకుల రామలక్ష్మి భుజంపై గురువారం నుంచే దురదగా ఉంది. శుక్రవారం ఉదయానికి మంట పుట్టి.. చర్మం కమిలిపోయి బొబ్బలు రావడంతో చర్మ విభాగ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. చాలామంది తమకు ఆహారం తీసుకోవడంలో ఇబ్బందులు వస్తున్నాయని చెబుతున్నారు. బాధితులందరికీ కిడ్నీలు, కాలేయ పనితీరు నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. వాటి నివేదికలు రావాల్సిఉంది.

48 గంటల తర్వాత కొత్త ఇబ్బందులు రావొచ్చని వైద్యవర్గాలు చెబుతున్నాయి. ఈ తరహా కేసులు ఇంతవరకు రాలేదని, ఒకేసారి వందల సంఖ్యలో అస్వస్థతకు గురికావడం, లేవలేని స్థితిలో ఆసుపత్రులకు రావడం వల్ల పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు చేయాలని వైద్యులు అంటున్నారు. 5ఏళ్ల మణిదీప్ ఇప్పటికీ కళ్ళు తెరవలేకపోతున్నాడు. ఇదే ప్రమాదంలో మణిదీప్ తండ్రి గోవిందరాజు ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే చనిపోయారు. మృతుడి కుమారుడు మణిదీప్ అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నా.. కన్నతండ్రిని కడసారి చూసేందుకు కళ్ళు తెరవకపోవడం కుటుంబ సభ్యులను మరింత కలచివేసింది. మణిదీప్ కళ్లకు చికిత్స చేయించేందుకు ఇవాళ వైద్యులు ఎల్ వి ప్రసాద్ నేత్ర వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం మణిదీప్ కోలుకుంటున్నాడని కొద్దికొద్దిగా కళ్లు కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు.

ఒళ్ళంతా నొప్పిగా మంటగా ఉందని.. చికిత్స పొందుతున్న చిన్నారులు, మహిళలు చెబుతున్నారు. ఒంటిపై దద్దుర్లు, కమిలిపోవడం వంటి లక్షణాలు ఉన్న వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వీరిలో యువకులు, చిన్నారులు, మహిళలు ఉన్నారు.

ఇవీచూడండి:ధాన్యం సేకరణలో అగ్రస్థానంలో తెలంగాణ: కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details