విశాఖ మన్యం... పచ్చని ప్రకృతి అందాలకు నెలవు. చలికాలం వచ్చిందంటే చాలు...ఇక్కడ అందాలకు హద్దే ఉండదంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా అరకులోయ పరిసర ప్రదేశాలు ఎంతో ఆకర్షణీయంగా దర్శనమిస్తాయి. అరకు అందాలకు వన్నెతెచ్చే ప్రత్యేకతల్లో వలిసె పూలు మరీ ప్రత్యేకమని చెప్పాలి.
ఘాట్‌రోడ్డు దాటుకుని అరకులోయలోకి ప్రవేశించింది మొదలు వలిసె పూల అందాలు పర్యటకుల మదిని దోచుకుంటాయి. ఎప్పుడెప్పుడు ఆ పూలతోటలోకి అడుగుపెడదామా... వాటి మధ్య నిలబడి ప్రకృతి ఒడిలో ఒదిగిపోదామా అని ఎవరికైనా అనిపించక తప్పదు. సెప్టెంబరు నెలాఖరు నుంచి జనవరి మొదటి వారం వరకు మాత్రమే ఇవి దర్శనమిస్తాయి.
అరకు, పాడేరు, చింతపల్లి ప్రాంతాల్లో మాత్రమే ఈ వలిసె పూలు కనిపిస్తాయి. కనిష్ట ఉష్ణోగ్రతల్లో మాత్రమే వలిసె తోటలు పెంచడం సాధ్యమవుతుంది. అరకు వచ్చే పర్యటకులతో ఈ అందాల తోటలు సందడిగా మారుతున్నాయి. చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రతిఒక్కరూ వలిసెల అందాలకు మంత్రముగ్ధులవుతున్నారు. ఆకర్షణీయమైన పసుపు పూలతోటల్లో ఫొటోలకు ఫోజులిస్తూ మురిసిపోతున్నారు.