Vinod Kumar Comments On Modi Telangana Tour : జులై 8న ప్రధానమంత్రి వరంగల్లో కాజీపేట ఓవర్ హాలింగ్ సెంటర్కు శంకుస్థాపన చేయడానికి రావడం పట్ల రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గతంలో కాజీపేటకు రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీని వేరే చోటుకు తరలించారని కేంద్ర ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేశారు. హైదరాబాద్లో ప్రత్యేకంగా ఇదే విషయంపై సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడారు.
కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ ఆలస్యంపై గతంలో ఎన్నో ఉద్యమాలు చేశామని రాష్ట్ర ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ తెలిపారు. ఈ కోచ్ ఫ్యాక్టరీని ఇస్తామని చెప్పి.. నాటి ప్రభుత్వాలు చెప్పాయని గుర్తు చేశారు. అయితే కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయలేదని చెప్పారు. కాజీపేటకు కేటాయించాల్సిన ఫ్యాక్టరీని.. ఇప్పుడు రైల్వే శాఖ మంత్రి స్వరాష్ట్రానికి తరలించేశారని ఆరోపించారు. తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావాలనేది ఇప్పటి నాటి డిమాండ్ కాదు.. దాదాపు 40 ఏళ్ల నుంచి పోరాటం చేస్తూనే ఉన్నామని పేర్కొన్నారు.
Vinod Kumar Fire On Modi : జులై 8న కాజీపేటలోని ఓవర్ హాలింగ్ సెంటర్కు శంకుస్థాపన చేయడానికి.. స్వయంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీనే రావడం ఆశ్చర్యకరంగా ఉందని వినోద్ కుమార్ వ్యాఖ్యానించారు. ఎందుకంటే ఈ పీరియాడికల్ ఓవర్ హాలింగ్ సెంటర్లో భాగంగా కేవలం వ్యాగన్లు శుభ్రం, మరమ్మతులు మాత్రమే చేస్తారని తెలిపారు. దీనికి కూడా ప్రధాని రావాలా అని ఎద్దేవా చేశారు. కాజీ పేటకు కోచ్ ఫ్యాక్టరీని ఇవ్వాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోనే ఉందని ఆయన వివరించారు.