తొలిపూజ అందుకునే గణనాథుడు ఈ ఏడాది మండపాలలో కొలువు తీరడానికి కరోనా అడ్డొచ్చింది. వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాలను పూజించొద్దని సర్కారు ఆదేశించింది. ఇళ్లలోనే వినాయకుని పూజలు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. దీనికి అనుగుణంగా పట్టణాలు, పల్లెలు వినాయక చతుర్థి వేడుకలు చేసుకోవడానికి సిద్ధమయ్యాయి. ఇళ్లల్లోనే పూజలకు అవసరమైన సామగ్రిని కొనుగోలుకు వచ్చేవారితో మార్కెట్లన్నీ శుక్రవారం కళకళలాడాయి. మండపంలో ప్రతిష్ఠించకపోయినా మా మది నిండా నీవే ఉన్నావు స్వామీ అంటూ చిన్నచిన్న ఏకదంతుని ప్రతిమలను కొని ఇళ్లకు తీసుకువెళుతున్నారు. ఇంటిలో కొలువై.. కంటితో విఘ్నాలన్నీ తొలగించి రాష్ట్రాన్ని, ప్రజలను ప్రగతి పథం వైపు నడిపించాలని కోరుతున్నారు.
మహమ్మారిని తుదముట్టించు..!
ప్రపంచ దేశాలను విష కౌగిలిలో బిగించి కొవిడ్-19 వికటాట్టహాసం చేస్తోంది. రోజు లక్షలాది మందికి ఈ మహమ్మారి సోకుతోంది. వేలాది మంది మృతికి కారణమవుతోంది. విశాఖ జిల్లాలోనూ ఈ వైరస్ విజృంభణ కొనసాగుతోంది. గత నెల్లాళ్లలో రోజూ వందలాది కేసులకుపైగా నమోదవుతున్నాయి. రోజుకు ఇద్దరు, ముగ్గురు చనిపోతున్నారు. శుక్రవారం నాటికి జిల్లాలో 29,225 మంది ఈ వైరస్ బారిన పడ్డారు. వారిలో 23,760 మంది డిశ్ఛార్జి అయ్యారు. ప్రస్తుతం 5,263 చికిత్స పొందుతున్నారు. 202 మంది మృత్యువాతపడ్డారు. రోజురోజుకు కేసులతో పాటు మరణాల సంఖ్య పెరుగుతుండటంతో జిల్లా ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో వైద్యులు, పారామెడికల్ సిబ్బంది కొరతను అధిగమించగలిగితే కొంతవరకు సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. సకల దేవతాగణాలకు అధిపతి అయిన విఘ్నేశ్వరుడే ఈ మహమ్మారిని రూపుమాపి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుతున్నారు.
ఇళ్లపట్టాలకు ఇక్కట్లెన్నో!
పేదల ఇళ్ల పట్టాల పంపిణీకి ఇప్పటికి మూడుసార్లు విఘ్నాలు ఎదురయ్యాయి. ఈ ఏడాది ఉగాది రోజున ఇళ్ల పట్టాలు అందిస్తామని రాష్ట్ర సర్కారు ప్రకటించింది. సరిగ్గా అదే సమయంలో కరోనా కలకలం మొదలవ్వడంతో జులై 8కి వాయిదా వేశారు. న్యాయస్థానాల్లో వివాదాలు నడుస్తున్నందున ఆగస్టు 15 నాడు తప్పకుండా ఇచ్చేస్తామన్నారు. ఇంతలోనే అక్టోబర్ రెండో తేదీకి వాయిదా వేశారు. జిల్లాలో వీటికోసం 2.98 లక్షల మంది లబ్ధిదారులు నిరీక్షిస్తున్నారు. పట్టాలందితే పక్కా ఇళ్లు నిర్మించుకోవాలని ఆశపడుతున్నారు. అక్టోబర్ 2 నాటికైనా పట్టాలు అందేలా చూడాలని లంబోదరుని వేడుకుంటున్నారు.