Missing man found : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సంఘటన ఇది. వైసీపీ సభకు జనాల్ని తీసుకెళ్తున్నారు.. అందరూ బస్సులు ఎక్కుతున్నారు.. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన మందబుద్ది ఉన్న గోపిచంద్‌ను.. నేతలు బస్సు ఎక్కించారు. సభ అయిపోయింది.. అందరు వెళ్లిన బస్సులో తిరిగి వచ్చారు. కానీ గోపిచంద్ మాత్రం గ్రామానికి రాలేదు. బిడ్డ ఏమైయ్యాడో అని తల్లి హృదయం తల్లడిల్లిపోయింది. కనిపించిన వారందరిని అడిగింది.. నా బిడ్డ ఎక్కడ! అని. మాకు తెలియదు అన్న సమాధానమే.. అందరి నోట వచ్చింది. కాళ్లు అరిగేలా బిడ్డ ఫోటో పట్టుకుని వీధుల వెంట తిరిగింది.
వైసీపీ సభకు వెళ్లి యువకుడు అదృశ్యం.. చివరకు ఇలా! ఈ మాతృమూర్తి ఆవేదన స్థానిక ఈటీవీ భారత్ విలేకరి కంట పడింది. ‘వైకాపా సభకు వెళ్లిన బిడ్డ తిరిగి రాలేదు’ అనే శీర్షికతో వార్తను ప్రచురించాడు. వార్తను చూసిన స్థానికలు..గోపిచంద్ ను గుర్తించారు. సమాచారాన్ని తల్లికి చేరవేయడంతో.. ఆ మాతృమూర్తి హృదయం పరవహించిపోయింది. ఇది విన్న గ్రామస్థుల ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. నెల రోజులుగా గ్రామంలో కనిపించని గోపిచంద్.. ఉన్నాడు.. వస్తున్నాడన్న సంగతి తెలియడంతో, గ్రామస్థులు డీజేతో ఘనస్వాగతం పలికారు.
వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం తోటచర్లకు చెందిన గోపించంద్ వయస్సు 22 సంవత్సరాలు. పుట్టుకతో మందబుద్ది. చిన్నతనంలోనే తండ్రి మృతిచెందడంతో.. చిన్న చిన్న పనులు చేసుకుంటూ, తల్లి జయమ్మే అతడి ఆలనాపాలనా చూసుకుంటుంది. గత నెల 7న వైసీపీ విజయవాడలో 'జయహో బీసీ' సభను నిర్వహించింది. ఈ సభకు బస్సులు ఏర్పాటు చేయడంతో..గ్రామస్థులందరు బస్సులు ఎక్కుతున్నారు. అక్కడే ఉన్న గోపిచంద్ ను స్థానిక నేతలు బస్సు ఎక్కించారు. అందరితో పాటు విజయవాడ వెళ్లిన గోపిచంద్.. తిరుగు ప్రయాణంలో కనిపించలేదు.
గోపిచంద్ ఆచూకీ కోసం తల్లి కనిపించిన వారందరిని అడిగిన ఫలితం లేకుండాపోయింది. చేసేది లేక ఒంటరిగానే..గోపించంద్ ఫోటో బ్యానర్ పట్టుకుని వీధుల వెంట తిరిగింది. ఈ మాతృమూర్తి ఆవేదన.. స్థానిక ఈనాడు విలేకరి కంటపడటంతో.. గోపిచంద్ కథ సుఖాంతం అయింది. ఆచూకీ కనిపెట్టిన స్ధానికులు విసన్నపేట పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ నుంచి గోపిచంద్..స్వగ్రామానికి చేరుకోవడంతో, గ్రామంలో హర్షాతిరేకం వ్యక్తమయింది. డీజే మ్యూజిక్ తో గోపించ్ ను ఊరేగించి.. ఆ తల్లికి అప్పగించారు గ్రామస్థులు. ఈటీవీ భారత్ కథనంతోనే తన బిడ్డ ఆచూకీ లభించిందని తల్లి జయమ్మ వెల్లడించింది.