జిల్లా పాలనాధికారులు, పంచాయితీ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి గ్రామం.. ప్రతి రోజు శుభ్రం కావాల్సిందేనని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి సహా రాష్ట్రంలో అధికార యంత్రాంగంలో ఎవరికైనా సరే గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడానికి మించిన మరో పని లేదన్నారు.
అవన్నీ బాగుపడి తీరాలి..
గ్రామాలు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ బాగుపడవని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గ్రామాల పరిశుభ్రతకు అవసరమైన నిధులు, విస్తృతమైన అధికారాలు, తగిన సిబ్బంది, స్పష్టమైన విధానాలు, పాలనా సౌలభ్యం గల గ్రామాలు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలోని పల్లెలన్నీ బాగుపడి తీరాలని సీఎం ఆకాంక్షించారు.
వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించడం సహా గ్రామీణ ప్రాంతాల్లో వసతుల కల్పన, అవసరమైన పనులు చేసుకునేలా ఉపాధి హామీ పథకాన్ని వ్యూహాత్మకంగా వినియోగించుకోవాలని సీఎం కోరారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా రైతుల భూముల్లో లక్ష కల్లాలను ఏర్పాటు చేయాలన్నారు.
రాబోయే 2 నెలల్లో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో వైకుంఠధామాల నిర్మాణం, 4 నెలల్లో రైతు వేదికల నిర్మాణం పూర్తి కావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాబోయే నాలుగేళ్లలో ఏ గ్రామంలో ఏ పని చేయాలన్న విషయంలో ప్రణాళికలు రూపొందించాలని.. అందుకు అనుగుణంగానే పనులు చేయాలన్నారు. ఈ వివరాలతో డిస్ట్రిక్ట్ కార్డు తయారు చేయాలని సీఎం స్పష్టం చేశారు.
మిడతల దండుతో గండమే..
మిడతల దండు ప్రమాదం రాష్ట్రానికి పూర్తిగా తొలిగిపోలేదని, పూర్తి అప్రమత్తంగా ఉండి అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. గతంలో వచ్చిన మిడతల దండులు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మీదుగా వెళ్లిపోయాయని... ప్రస్తుతం మరో దండు వార్దా సమీపంలోకి వచ్చిందని సీఎం పేర్కొన్నారు. ఈ దండు తెలంగాణకు వచ్చే అవకాశం ఉందని.. జూన్ 25 నుంచి జూలై వరకు మరోసారి మిడతల దండు వచ్చే ప్రమాదం పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారన్నారు.
అప్రమత్తత అవసరం
అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్న ముఖ్యమంత్రి... ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, కొత్తగూడెం, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఈ జిల్లాల కలెక్టర్లు, పోలీస్, అటవీ, వ్యవసాయ, అగ్నిమాపక అధికారులు, ఎంటమాలజీ నిపుణులు బుధవారం సమావేశమై అవసరమైన వ్యూహం ఖరారు చేయాలని ఆయన ఆదేశించారు.
కొవిడ్ నియంత్రణకు జిల్లా స్థాయిలో చర్యలు..
కరోనా వ్యాప్తి నివారణకు జిల్లా స్థాయిలో అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తూ అందుకు అనుగుణంగా వ్యూహం ఖరారు చేసుకోవాలని సూచించారు. కరోనా విషయంలో సమర్థంగా పని చేస్తూనే వర్షాకాలంలో వచ్చే అంటు వ్యాధుల నివారణకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి : రైతుబంధు పథకం అమలు ఉత్తర్వులు జారీ