దక్షిణ మధ్య రైల్వేలో విజయవాడ-గూడూరు, విజయవాడ-కాజీపేట మధ్య ప్రస్తుతం రెండు లైన్లే ఉన్నాయి. ఓవైపు ప్రయాణికుల రైళ్లు, మరోవైపు గూడ్సు రైళ్లు ట్రాక్ సామర్థ్యానికి మించి నడుస్తున్నాయి. 3వ లైను మార్గం పూర్తయితే హైదరాబాద్ నుంచి గూడూరు, చెన్నై, తిరుపతి, తిరువనంతపురం ప్రాంతాలకు రైళ్ల రాకపోకలు వేగవంతం అవుతాయి. అదనపు రైళ్లు ప్రవేశపెట్టేందుకు దోహదం చేస్తుంది.
ఏకకాలంలో పనులు...
గూడూరు-బిట్రగుంట, బిట్రగుంట-కొవ్వూరు, కొవ్వూరు-కృష్ణాకెనాల్ మధ్య ఏకకాలంలో మొదలైన పనులు కీలకదశలో ఉన్నాయి. సికింద్రాబాద్ నుంచి చెన్నై, తిరుపతి, తిరువనంతపురం వైపు వెళ్లే రైళ్లలో కొన్ని కాజీపేట, విజయవాడ, గూడూరు మీదుగా.. మరికొన్ని నల్గొండ, గుంటూరు, గూడురు మీదుగా వెళుతున్నాయి. కాజీపేట నుంచి విజయవాడ వరకు కూడా 3వ లైను పనులు జరుగుతున్నాయి. విజయవాడ-కొండపల్లి మధ్య 19.5 కిమీ మేర 3వ లైను పనులు దాదాపు పూర్తయ్యాయి. 2021-22 బడ్జెట్‌లో రూ.333 కోట్లు కేటాయించారు. ఈ లైను కూడా పూర్తయితే కాజీపేట నుంచి గూడూరు వరకు 508 కిమీ మేర 3వ లైను అందుబాటులోకి వస్తుంది. సరకురవాణా పెరిగేందుకు దోహదం చేస్తుంది.