తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈ అమ్మాయిలు అమెరికాలో అడ్మిషన్ మాత్రమే కాదు.. రూ. కోట్ల స్కాలర్ షిప్.. సాధించారు! - andhra pradesh latest news

FOREIGN EDUCATION SCHOLARSHIPS : విదేశీ విద్య ఎంతోమంది విద్యార్థుల కల! పేరున్న విశ్వవిద్యాలయాల్లో ప్రవేశమే గగనమంటే.. ఖర్చు భరించడం ఇంకా కష్టం. ఈ విజయవాడ అమ్మాయిలు పట్టుదలతో అమెరికాలోని ప్రఖ్యాత డ్రెక్సెల్‌ విశ్వవిద్యాలయంలో ప్రవేశాన్నే కాదు.. రూ.కోట్ల స్కాలర్‌షిప్‌నీ సాధించారు. జోషిక, అక్షర, యుక్తా.. ఈ ముగ్గురు తమ కృషిని పంచుకున్నారిలా!

FOREIGN EDUCATION SCHOLARSHIPS
FOREIGN EDUCATION SCHOLARSHIPS

By

Published : Dec 19, 2022, 2:46 PM IST

SCHOLARSHIPS: విదేశీ విద్య ఎంతో మంది విద్యార్థుల స్వప్నం. ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో సీటు సంపాదించటం అంటే గగనమే చెప్పాలి. ఒకవేళ సీటు వచ్చిన ఖర్చు భరించాలంటే కష్టం. అలాంటిది ఈ అమ్మాయిలు అమెరికాలోని ప్రముఖ విశ్వవిద్యాలయంలో సీటు పొందటమే కాకుండా కోట్ల రూపాయల స్కాలర్​షిప్​ను పొందారు. మరి వారి కృషి వారి మాటల్లోనే..

చిన్ననాటి కల: చల్లా జోషిక

అమెరికాలో చదవాలన్నది నా చిన్ననాటి కల. అందుకు ప్రతిభే కాదు నైపుణ్యాలూ కావాలి. అందుకే వ్యాపార నైపుణ్యాల సముపార్జన కోసం క్యాండిల్స్‌ వ్యాపారం చేశా. ఆరు నెలలు ఇంటర్న్‌షిప్‌, స్కూల్‌ కోసం వెబ్‌సైట్‌ తయారీ వంటివి చేశా. ఏడాదిన్నర నుంచే నా సన్నద్ధత ప్రారంభించా. చదువుపై దృష్టిపెడుతూనే విదేశీ విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్షలకూ సిద్ధమయ్యా. రోజూ వీటికోసమే 5గం. కేటాయించా. కష్టం ఫలించింది.. సీటుతోపాటు రూ.1.5 కోట్ల ఉపకార వేతనాన్నీ పొందా.

నాన్న ఓబులేశు శ్రీకాకుళం మున్సిపల్‌ కమిషనర్‌, అమ్మ అరుణ. మొదట్నుంచీ మంచి విద్యార్థినే! ప్రస్తుతం ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌లో చదువుతున్నా. ఇంటర్‌ మొదటి ఏడాది జాతీయ స్థాయిలో టాప్‌ అయిదుగురిలో ఒకరిగా నిలిచా. దీంతో ఇంట్లోవాళ్లూ అమెరికాలో చదవాలన్న నా కోరికకు అండగా నిలిచారు. బిజినెస్‌ విత్‌ టెక్నాలజీలో డిగ్రీ చేయాలన్నది కల. పీజీ కూడా చేసి, మంచి వ్యాపారవేత్తగా ఎదగాలన్నది నా ఆశయం.

నాసా ఆహ్వానం: వేమూరి సాయి అక్షర

ఎనిమిదో తరగతిలోనే అమెరికాలో కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ చేయాలని నిర్ణయించుకున్నా. నాన్న వేణుగోపాలరావు, అమ్మ సుజనశ్రీ... ఇద్దరూ అధ్యాపకులే! వాళ్ల సాయంతో వందల ప్రాజెక్టులు, చిన్న స్టార్టప్‌లకు పనిచేశా. ఈ అనుభవం, ఇంకా ప్రవేశపరీక్ష కోసమని తీసుకున్న శిక్షణ డ్రెక్సెల్‌ విశ్వవిద్యాలయంలో సీటుతోపాటు రూ.1.2 కోట్ల ఉపకారవేతనం పొందడానికి కారణమయ్యాయి. రోజుకు వీటి కోసమే ఆరు గంటలు కష్టపడేదాన్ని. మా కోచ్‌ ‘కృష్ణమోహన్‌’ ఈ విషయంలో చాలా సాయ పడ్డారు. నాకు మరో విశ్వవిద్యాలయం నుంచీ ఉపకార వేతనం అందింది. మరికొన్ని విశ్వవిద్యాలయాల నుంచి స్పందన రావాల్సి ఉంది.

మొదట్నుంచీ భిన్న అంశాలపై దృష్టి పెట్టా. 2020లో 5.12 నిమిషాల్లో స్క్వేర్‌ రూట్‌ 2 విలువను 6020 డెసిమల్స్‌ వరకూ విస్తరించా. అప్పుడదో ప్రపంచరికార్డు కూడా. ఆ సమయంలో అప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడిని కలిసే అవకాశమూ వచ్చింది. ‘మ్యాథ్‌ జీనియస్‌, ఎక్సలెన్స్‌’ వంటి ఎన్నో పురస్కారాలు అందుకున్నా. ‘నాసా’ టెక్నికల్‌ పోటీల్లో విజయం సాధించి 2023 ఏప్రిల్‌లో అమెరికా వెళ్లడానికి ఆహ్వానం అందుకున్నా. శ్రీహరికోట ఉపగ్రహ ప్రయోగం దగ్గరుండి చూసే అవకాశమొచ్చింది. జాతీయ స్థాయి ఆర్చర్‌ని. నాకు మొదట్నుంచీ పరిశోధనలంటే ఆసక్తి. ఈ రంగంలో రాణించాలన్నది లక్ష్యం.

డేటా సైన్స్‌పై పట్టుకు: యుక్తా టాటా కోగంటి

ఇంటర్‌లో చేరిన తొలి నాళ్లలో కంప్యూటర్స్‌ మీదికి ఆసక్తి మళ్లింది. అదీ అమెరికాలో పూర్తి చేస్తే భవిష్యత్తు బాగుంటుందని అనిపించింది. అందుకే మొదటి ఏడాది నుంచే దృష్టిపెట్టా. రోజూ ఇంటర్‌ సబ్జెక్టులు చదివాక విదేశీ విశ్వవిద్యాలయాల వెబ్‌సైట్లు పరిశీలించే దాన్ని. అవి విద్యార్థుల నుంచి ఏమేం ఆశిస్తున్నాయో అధ్యయనం చేశా. వాటిపై దృష్టి పెడుతూనే శిక్షణా తీసుకున్నా. విజయవాడ శ్రీచైతన్యలో సీనియర్‌ ఇంటర్‌ చదువుతున్నా. నాన్న సునీల్‌ కుమార్‌ దేవదాయశాఖలో ఈఓ.

అమ్మ మాధవి రసాయన శాస్త్ర అధ్యాపకురాలు. నా లక్ష్యానికి వారి ప్రోత్సాహమూ తోడవ్వడంతో ఏడాది నుంచి శ్రమిస్తూ వివిధ అంశాల్లో పట్టు సాధించా. రోజూ 6గం. సాధనకే కేటాయించా. విజయవాడ మున్సిపాలిటీకి ఓపెన్‌ డ్రైనేజీ వల్ల నష్టాలను చెబుతూ ‘క్లోజ్‌డ్‌ డ్రైనేజీ’ ప్రాజెక్టు చేసిచ్చా. దానికి ప్రశంసలూ అందుకున్నా. నాయకత్వ లక్షణాలూ ఎక్కువే. ఇవన్నీ రూ.1.03 కోట్ల ఉపకారవేతనం లభించేలా చేశాయి. దీని కోసం విజయవాడలోనే ‘ఇన్‌విక్టా’ సంస్థలో జోషిక, అక్షరతో కలిసి శిక్షణా తీసుకున్నా. డేటా సైన్స్‌లో మంచి పేరు తెచ్చుకోవాలన్నది నా కల.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details