ఏపీలోని కృష్ణానది తీరాన బెజవాడ నగరంలో అనేక చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. బ్రిటీష్ కాలంలో... బెజవాడ కేంద్రంగా జాతీయ నాయకత్వం అనేక స్వాతంత్య్ర పోరాటాలు చేసింది. అందులో భాగంగానే జాతిపిత బాపూజీ ఇక్కడి చాలా సార్లు వచ్చారు. ఈ ప్రాంతంలోని అనేక మంది నాయకులను జాతీయ ఉద్యమానికి తోడ్పడాలని ప్రోత్సహించారు. 1920లో విజయవాడకు విచ్చేసిన మహాత్ముడు... ప్రస్తుతం ఉన్న రైల్వే స్టేషన్‌కు పశ్చిమ భాగంలో... కొండకింద ఒక సమావేశాన్ని నిర్వహించారు. తెల్లదొరల నుంచి మన దేశానికి విముక్తి కలిగించేందుకు చేయాల్సిన పోరాటాలను గురించి వివరించారు.
కొండ పైభాగంలో 52 అడుగుల స్తూపం
సాతంత్య్ర పోరాట సమయంలో బాపూజీ విజయవాడలో పర్యటించిన ప్రాంతాలను... సాతంత్య్రం అనంతరం పర్యాటక ప్రదేశాలుగా ఏర్పాటు చేశారు. అందులో గాంధీ కొండ ఒకటి. నేషనల్ గాంధీ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో.. కొండ పైభాగంలో గాంధీజీ స్మారక చిహ్నం ఉన్న 52 అడుగుల స్తూపాన్ని నెలకొల్పారు. 1965లో నిర్మాణాన్ని ప్రారంభించగా 1968లో పూర్తైంది. అప్పటి ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి దీన్ని ప్రారంభించారు. అక్కడే ఓ గ్రంథాలయం కూడా ఏర్పాటు చేశారు. ఇందులో గాంధీ జీవిత చరిత్ర, స్వాతంత్య్ర సమరయోధులకు సంబంధించిన అనేక విశేషాలతో కూడిన పుస్తకాలను అందుబాటులో ఉంచారు.
కొద్దికాలం ఈ గాంధీ కొండను సంరక్షించినా... ఆ తర్వాత నిర్వహణ లోపించి పిచ్చిమొక్కలు మొలిచాయి. కొన్నాళ్ల పాటు జనాలు అక్కడికి వెళ్లినా... అక్కడ పేరుకుపోయిన చెత్తా, చెదారం, పిచ్చి మొక్కలతో వల్ల వెళ్లడం మానేశారు. అక్కడకు వెళ్లే దారిలో విద్యుద్దీపాలు కూడా లేకపోవడం గమనార్హం. ఏడాదిన్నర క్రితం నగరపాలక సంస్థ ఈ గాంధీ కొండను బాగు చేసేందుకు చర్యలు చేపట్టింది. అప్పడే కరోనా రావడంతో పనులను వాయిదా వేసింది.
చిన్న పిల్లల కోసం టాయ్ రైలు..
గాంధీ జయంతి ఉత్సవాల సందర్బంగా మళ్లీ ఈ కొండను బాగుచేసేందుకు నగరపాలక సంస్థ ముందుకొచ్చింది. 10 రోజుల క్రితం నుంచి పనులను ప్రారంభించారు. రహదారికి ఇరువైపులా విద్యుద్దీపాలు, స్మారక స్తూపం వద్ద పచ్చటి గడ్డి, మెుక్కలు నాటారు. చారిత్రాత్మక పోటీలనూ పెట్టారు. గాంధీహిల్ నుంచి నగరాన్ని చూసే చిన్నపిల్లల కోసం టాయ్ రైలును ఏర్పాటు చేశారు. దాదాపు భూమికి 500 అడుగుల ఎత్తులో ఈ బాపూజీ స్తూపం ఉండడం పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇక్కడి నుంచి ప్రకాశం బ్యారేజీ, కనకదుర్గమ్మ గుడిని కూడా చూడవచ్చు. మరికొన్ని రోజుల్లోనే గాంధీ కొండపై పనులు పూర్తి అవుతాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం గాంధీ కొండను చూసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తున్నారని తెలిపారు.
VIJAYAWADA GANDHI HILL: కృష్ణమ్మ తీరాన గాంధీ కొండ.. బాపూజీ స్మరణలు గుండెలనిండా.. ఇదీ చూడండి:ఆదుకోండి: భర్తను బాధ్యతను భుజానికెత్తుకుంది... కొండంత ధైర్యంతో...