దీపావళి పర్వదినం సందర్భంగా శనివారం సాయంత్రం ఏపీలోని విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానాన్ని మూసివేయనున్నారు. అమ్మవారికి పంచహారతుల అనంతరం రాత్రి ఏడు గంటల నుంచి ఆలయాన్ని మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఆదివారం ఉదయం యథావిధిగా అమ్మవారి ఆలయం తెరవనున్నట్లు వివరించారు. కార్తీకమాసాన్ని పురస్కరించుకుని ఆదివారం సాయంత్రం ప్రదోషకాలంలో అమ్మవారి ప్రధాన ఆలయంతోపాటు... శివాలయం, నటరాజస్వామి దేవస్థానాల్లో ఆకాశదీపం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
16న అమ్మవారికి విశేష అలంకరణ
ఈనెల 16న దుర్గమ్మకు వివిధ రంగుల గాజులతో విశేష అలంకరణ చేయనున్నారు. కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని అమ్మవారి ప్రధాన ఆలయ ప్రాంగణాన్ని మాత్రమే గాజులతో అలంకరించాలని వైదిక కమిటీ నిర్ణయించింది. ఆ రోజు నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు మల్లేశ్వరస్వామి ఆలయంలో ఆకాశ దీపం ఏర్పాటు, లక్ష్మీగణపతి పంచాక్షరీ పఠనాలు, ప్రత్యేక బిల్వార్చనలు, లక్ష బిల్వార్చనలు, సమస్ర లింగార్చనలు, త్రికాల అభిషేకాలు నిర్వహించనున్నారు.
ఈనెల 18న నాగుల చవితి సందర్భంగా వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 29న కార్తీక పౌర్ణమి సందర్భంగా కొండపై దీపోత్సవం, శివాలయంలో జ్వాలాతోరణం నిర్వహించునున్నట్లు ఆలయాధికారులు తెలిపారు.
ఇదీ చదవండి:తోడు కోసం వచ్చి... ఒంటరిగా కన్నుమూసి..