ఏపీలో రెండో అతిపెద్ద దేవాలయంగా భాసిల్లుతున్న విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం స్థిరాస్తులు కనుమరుగవుతున్నాయి. ఆలయానికి దాతలు, దత్త దేవాలయాల ద్వారా సంక్రమించిన 243 ఎకరాల భూములు... కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉన్నాయి. వీటికి ఏడాదికి రూ.50 లక్షలకు మించి కౌలు రావడం లేదు. నామమాత్రపు లీజులతో అయిన వారికి కట్టబెడుతుండటమే ఇందుకు కారణం. పైగా కొన్నింటి కౌలుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదంటూ ఖాళీగానే ఉంచుతూ ఆలయ ఆదాయానికి గండి కొడుతున్నారు. భూములు ఆక్రమణలకు గురవుతున్నా అధికారులు చూసీ చూడనట్లు ఉంటున్నారు. దుర్గగుడికి సంబంధించిన ఆస్తుల రిజిస్టరును 2010 నుంచి అప్‌డేట్ చేయలేదు. గత పాలకవర్గం దుర్గగుడి భూములపై రీసర్వే చేసి పట్టాలు ఇప్పించాలని జిల్లా కలెక్టర్‌ను కోరినా.... ఇప్పటివరకు సర్వే జరగలేదు.
కౌలు లీజుల్లో అక్రమాలు
భూములను కౌలుకు ఇచ్చే ప్రక్రియలో అక్రమాలు జరగడం వల్ల ఏటా వేలం నిర్వహించి లీజులకు ఇస్తున్నారు. గ్రామాల్లో టముకు వేయించి వేలంలో ఎవరు ఎక్కువ ఇవ్వడానికి ముందుకు వస్తే వారికి భూములను అప్పగించాల్సి ఉండగా.... కానీ నామమాత్రపు లీజుకు ఇస్తూ అవినీతికి పాల్పడుతున్నట్లు అ.ని.శా. గుర్తించింది. ఆస్తులు, భూముల వేలానికి సంబంధించిన 43 రిజిస్టరు, 8ఏ రిజిస్టరులో పలు లోపాలను గుర్తించింది. ఆడిట్ అభ్యంతరాలున్నా వాటికి స్పష్టత, వివరణలు ఇవ్వలేదు. దానివల్ల ఈ విభాగానికి చెందిన సూపరింటెండెంట్, ఉద్యోగులను సస్పెండ్ చేయాలని దేవాదాయశాఖ కమిషనర్ ఆదేశించారు.
సేద్యం పేరిట మురుగు నింపేశారు
కృష్ణా జిల్లాలోని కంకిపాడు మండలం పునాదిపాడులో 7.86 ఎకరాల పొలముంది. కొన్నేళ్లుగా దీన్ని ఎవరూ సేద్యం చేయడం లేదు. దస్త్రాల్లో మాత్రం ఏటా సాగు చేస్తున్నట్లు ఉంటుంది. నామమాత్రపు కౌలు చెల్లించినట్లు ఉంటుంది. ఈ పొలం పక్కనే ఓ కార్పొరేట్ విద్యా సంస్థ నుంచి వచ్చే మురుగు నీరంతా ఇక్కడే నిలుస్తోంది. కార్పొరేట్ సంస్థ అధిక మొత్తంలో కౌలు చెల్లిస్తే దానిలో కొంతమేరకే దుర్గగుడికి చెల్లిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. పాతపాడు పరిధిలోనూ 5.89 ఎకరాల భూమి రెండేళ్ల నుంచి ఖాళీగా ఉంటోంది. కంకిపాడు మండలం గోశాల, ఈడుపుగల్లు గ్రామాల్లోని దత్త దేవాలయాల భూముల కౌలుకు లెక్క లేకుండా పోయింది.