రాష్ట్రంలో రైతుల నుంచి పాల కొనుగోలు వ్యూహాలను రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య - విజయ డైరీ మార్చింది. ప్రైవేటు డైరీల మాదిరిగానే ప్రాంతాల వారీగా పాల ధర పెంచి ఇచ్చేందుకు శ్రీకారం చుట్టింది. వేసవి సమీపిస్తున్న వేళ... పాల కొరత క్రమంగా పెరుగుతోంది. వేసవి ఎండలకు పశువుల్లో పాల ఉత్పత్తి తగ్గడం సహజం. ఈ నేపథ్యంలో విజయ డైరీకి పాలు పోస్తున్న రైతులను తమ వైపు మళ్లించుకునేందుకు ప్రైవేటు డైరీలు ఒక్కో గ్రామంలో ఒక్కో ధర చెల్లిస్తున్నాయి. ఫలితంగా విజయ డైరీకి పాలు పోసే రైతులు అటు వైపు వెళుతున్నారు. వారిని తిరిగి రప్పించుకునేందుకు విజయ కూడా అదే తీరుగా ధరలు పెంచుతోంది.
పాలకొరత పెరుగుతోంది...
రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో ఇచ్చే ధర కన్నా... జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలంలో అదనంగా లీటరుకు 2 రూపాయలు ఇస్తుండటం రైతులను ఆకర్షించింది. తిరిగి విజయడైరీకి పాలు పోస్తున్నారని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం రోజూ 3 లక్షల 50 వేల లీటర్ల పాలు అవసరం కాగా... ప్రస్తుతం 2 లక్షల 12వేల లీటర్ల పాలు మాత్రమే వస్తున్నాయి. గతేడాది కంటే దాదాపు లక్షన్నర లీటర్ల వరకు పాల సేకరణ తగ్గింది. గత నెలరోజులుగా రాష్ట్రంలో పాల కొరత క్రమంగా పెరుగుతున్నందున ప్రైవేటు డైరీలు గ్రామాల్లో తిరుగుతూ ఎక్కడికక్కడ ధరలు పెంచి కొంటున్నాయి. దీంతో విజయ డైరీ అధికారులందరినీ గ్రామాలకు పంపి రైతులు చేజారిపోకుండా అవగాహన కల్పిస్తున్నారు.