సృష్టి అంతా ఆవరించి ఉన్న పరమ చైతన్యాన్ని, ప్రకృష్టమైన శక్తిని జగన్మాతగా ఆర్ష ధర్మం దర్శిస్తోంది. సకల సృష్టికి మూలం శక్తి. సృష్టి స్థితి లయాత్మకమైన శక్తి పలు రీతుల వ్యక్తమవుతోంది. ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తులే జగత్తును ముందుకు నడిపిస్తున్నాయి. ఏ కార్యక్రమాన్నైనా నిర్వహించాలనే సంకల్పం- ఇచ్ఛ! ఆ వ్యవహారానికి నిర్మాణాత్మక ప్రణాళిక రూపకల్పన- జ్ఞానం! సంకల్పాన్ని, ప్రణాళికను సమ్మిళితం చేయడం క్రియ! ఈ మూడింటి సర్వ సమగ్ర రూపమే మహాశక్తి. అందుకే ఆ దివ్యజనని విశ్వనిర్వహణా శక్తిగా ప్రకటితమవుతోంది.
సౌజన్య పూరితమైన, సౌమనస్యదాయకమైన భావజాలం వ్యక్తుల్లో పరివ్యాప్తం కావాలని ఆదిశక్తి అభిలషిస్తుంది. అరిషడ్వర్గాలతో అహంకారయుతంగా పెచ్చరిల్లడం దనుజత్వం. ఆ తమోగుణం తొలగించుకుని సత్వగుణాన్ని సాధించడం దివ్యత్వం. అజ్ఞానయుతమైన ఆసురీ శక్తుల్ని అంతం చేసి, వారిలో జ్ఞాన గరిమను పెంపొందించి, తమస్సు నిండిన హృదయాల్లో ఉషస్సు నింపడానికి అంబ అవతరించింది. అందుకే ఆ మహా శక్తిని, అజ్ఞానుల హృదయాల్లో గూడుకట్టుకున్న చీకటిని తొలగించే సూర్య ప్రకాశ ద్వీపనగరిగా, మహా చైతన్యం నిండిన మకరంద ఝరిగా జగద్గురువు ఆదిశంకరులు సౌందర్యలహరిలో ప్రస్తుతించారు.
శరత్కాలంలో ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి విజయదశమి వరకు కొనసాగే అమ్మ ఆరాధనా క్రమాన్ని శక్తి తంత్రంగా పేర్కొంటారు. భక్తి భావన, ధర్మపాలన, యోగసాధన, ఆధ్యాత్మిక చింతన, నైతిక రుజువర్తన వంటి ఉత్తమ గుణాలనే పుష్పాలతో దేవిని పూజించే అర్చనా సంవిధానమే శక్తి తంత్రం.
ఆంతరంగికమైన వైపరీత్య భావాలపై పైచేయి సాధించడం విజయం. బాహ్యంగా తారసిల్లే దుష్టశక్తులపై యుక్తిగా గెలవడం జయం. ఈ రెండింటినీ సమన్వయంగా అనుగ్రహించే శక్తి ఆకృతి విజయేశ్వరి! రక్షణాత్మకమైన క్షేమకారక శక్తి విజయదశమి నాడు అపరాజితగా అలరారుతుంది. అసురులందరూ వ్యక్తుల్లో ఉండే అనేక ప్రతికూల ధోరణులకు సంకేతం. ఒకే ఒక్క మహాశక్తి అనేక రూపాలుగా విడివడి దుష్ట సంహారం చేసింది. ఆసురీ భావాలు విజృంభిస్తే ముందు వ్యక్తులు పతనమవుతారు. ఆపై వ్యవస్థలు కునారిల్లుతాయి. దుర్గాంబను వేదం తారణీశక్తిగా, అంటే అన్నింటినీ అధిగమింపజేసే దివ్యరూపిణిగా ప్రస్తావించింది. దుర్మార్గం, దుష్టత్వం, దురాచారం వంటి దురితాల్ని నిలువరించి, సర్వశుభ మంగళదాయినిగా విజయవిలాసిని వర్ధిల్లుతోంది.
నిస్తేజాన్ని జయించి, జడత్వాన్ని అధిగమించి, ప్రయత్నశీలతతో పురోగమించి, కర్తవ్యదీక్షతో అనుకున్నది సాధించడానికి కావాల్సిన శక్తిని అందుకోవడానికి ఉపకరించే ఉపాసన- శరన్నవరాత్రుల్లో శక్తి ఆరాధన! సద్బుద్ధి, సౌశీల్యం వంటి సుగుణాలకు బలిమిని, కలిమిని అందించడమే శక్తిమాతల అనుగ్రహ ఫలం. విజయదశమినాడు ‘అగ్ని గర్భ’గా వ్యవహరించే శమీ వృక్షాన్ని పూజిస్తాం. మనలో ఉన్న ఉగ్రత్వం, క్రోధం, తీష్ణత వంటి అగ్నితత్వాలన్నీ తొలగి, వ్యతిరేక అంశాలు శమింపజేయడానికి శమీపూజ ఉపయుక్తమవుతుందని చెబుతారు. ఐశ్వర్యం, ధీరత్వం, కీర్తి, తేజస్సు, ఆరోగ్యం, ఆకర్షణ, ఆనందం, సౌజన్యం అనే అష్టమహా ఫలితాల్ని శరన్నవరాత్రుల్లో భక్తులు దేవీ కరుణతో సాధిస్తారని దేవీ భాగవతం వివరించింది. అందుకోసం విజయద అయిన అపరాజిత అనుగ్రహాన్ని సర్వదా ఆకాంక్షించాలి!
ఇదీ చదవండి-రాష్ట్ర ప్రజలకు సీఎం విజయదశమి శుభాకాంక్షలు