రాష్ట్రంలో కొత్త విద్యా సంవత్సరం(2021-22)లో విద్యా వాలంటీర్ల సేవలు అవసరం లేదని విద్యాశాఖ భావిస్తోంది. రాష్ట్రంలో 25 వేల ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. శాశ్వత ఉపాధ్యాయుల కొరత నేపథ్యంలో.. ఏటా తాత్కాలిక పద్ధతిన విద్యా వాలంటీర్లను నియమిస్తున్నారు. వేసవి సెలవులను మినహాయించి మిగిలిన 10 నెలలకుగాను నెలకు రూ.12 వేల చొప్పున వేతనాలిస్తారు.
2019-20 విద్యా సంవత్సరం వరకు దాదాపు 12 వేల మంది పనిచేశారు. కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించడంతో 2020 మార్చిలో బడులు మూతపడ్డాయి. అప్పటినుంచి వారికి జీతాలు లేవు. గత విద్యా సంవత్సరం (2020-21)లో విధుల్లోకి తీసుకోలేదు. అధిక శాతం మంది కూలి పనులు చేసుకుంటున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో పదవీ విరమణ, ఖాళీల స్థానంలో ఎంతమంది విద్యా వాలంటీర్లు అవసరమో వివరాలు పంపాలని ఫిబ్రవరి 15న డీఈఓలను పాఠశాల విద్యాశాఖ లిఖితపూర్వకంగా ఆదేశించింది. తాజా పరిస్థితిపై మాత్రం సమాచారం అడగలేదు.