ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌భేటీ అయ్యారు. దిల్లీలోని ఉపరాష్ట్రపతి వెంకయ్య నివాసంలో జరిగిన ఈ సమావేశంలో వాణిజ్యశాఖ, భారీ పరిశ్రమలశాఖ కార్యదర్శులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర ప్రతిపాదిత ప్రాజెక్టుల పనితీరుపై ఉపరాష్ట్రపతి వాకబు చేశారు. విశాఖ-చిత్తూరు మధ్య పారిశ్రామిక కారిడార్ పనులపై చర్చించారు. కాకినాడలో ఐఐపీ, ఐఐఎఫ్‌టీ ఏర్పాటు, గుంటూరు జిల్లాలో స్పైస్ పార్క్ ఏర్పాటుపై సమావేశంలో చర్చించినట్లు సమాచారం.
విభజన చట్టంలోని ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేయండి: వెంకయ్య నాయుడు - తెలుగు రాష్ట్రాల ప్రాజెక్టులపై వెంకయ్య ఆరా
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో కేంద్రమంత్రి పీయూష్ గోయల్, వివిధ శాఖల కార్యదర్శులు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రతిపాదిత ప్రాజెక్టుల పనితీరును ఉపరాష్ట్రపతి అడిగి తెలుసుకున్నారు. విభజన సమస్యలను ఇరు రాష్ట్రాలతో చర్చించి పరిష్కరించాలని సూచించారు.
విభజన సమస్యలపై ఆరా...
హైదరాబాద్-వరంగల్, హైదరాబాద్-నాగ్‌పూర్ పారిశ్రామిక కారిడార్లు, రంగారెడ్డిలో ఏర్పాటు చేయనున్న ఫార్మాసిటీ అంశాలపై సమావేశంలో చర్చించనట్లు తెలుస్తోంది. పునర్విభజన చట్టంలో పేర్కొన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలని ఉపరాష్ట్రపతి కోరారు. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలతో మాట్లాడి ప్రాజెక్టుల పనులు వేగవంతం చేయాలని వెంకయ్య సూచించారు. ప్రాజెక్టుల వ్యవహారంలో సమస్యలను పరిష్కరించాలన్నారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసేలా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో చర్చిస్తామని ఉప రాష్ట్రపతికి కేంద్రమంత్రి, అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి :'రాజకీయ నాయకులు ప్రత్యర్థులే కానీ.. శత్రువులు కాదు'