మాజీ పార్లమెంట్ సభ్యులు యలమంచిలి శివాజీ రచించిన 'పల్లెకు పట్టాభిషేకం'పుస్తకాన్ని హైదరాబాద్‌లోని మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. రైతునేస్తం పబ్లికేషన్స్ ప్రచురించిన ఈ పుస్తక తొలిప్రతిని రచయిత అల్లుడు సునీల్ కుమార్‌కు అందజేశారు. గ్రామరాజ్యంలేని రామరాజ్యం అసంపూర్ణమన్న మహాత్మాగాంధీ మాటల స్ఫూర్తితో.. గ్రామీణాభివృద్ధి, రైతు స్వావలంబనతోపాటు పల్లెల్లో సుపరిపాలన జరగాలని ఆకాంక్షించారు. రైతులకు కావాల్సింది ఉచిత పథకాలు కాదని.. శాశ్వత పరిష్కార మార్గాలని ఉపరాష్ట్రపతి ఉద్ఘాటించారు. పల్లెలకు, పట్టణాలకు మధ్య అంతరం పెరుగుతోందని.. గ్రామాలను పట్టణాలకు ఆహారాన్ని అందించే కర్మాగారాలుగానే చూస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి
ఈ పరిస్థితి మారి పల్లెల గొప్పతనాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని... పండుగలకు సొంతూరు వెళ్లి వాటి అభివృద్ధికి కృషి చేయాలని ఉపరాష్ట్రపతి పిలుపునిచ్చారు. పల్లె పరిస్థితులు, వ్యవసాయం, పంటలు, రైతుల సమస్యలు, పరిష్కార మార్గాలు వంటి అంశాలతో పుస్తకాన్ని అద్భుతంగా రచించారని ఉపరాష్ట్రపతి కొనియాడారు. కరోనా సంక్షోభంలో ప్రపంచమంతా స్తంభించిపోయినా దేశంలో వ్యవసాయ ఉత్పత్తి రెట్టింపు చేసిన ఘనత మన రైతులదేనని వెంకయ్యనాయుడు చెప్పుకొచ్చారు. రైతులు పండించే ఉత్పత్తులకు మంచి ధరను అందించటంతోపాటు సకాలంలో, సరసమైన విధంగా రుణాలు అందించాల్సిన అవసరం ఉందన్నారు.
రైతులకు ఫుడ్ ప్రాసెసింగ్‌పై అవగాహన కల్పించాలి