సకాలంలో నాణ్యమైన విత్తనాలు, విద్యుత్, పంట రుణాలు, నీటిపారుదల, బీమా, గిట్టుబాటు ధరలు కల్పిస్తే రుణ మాఫీ, ఉచిత విద్యుత్ వంటి డిమాండ్లు రావని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. వ్యవసాయ రంగంలో వస్తున్న విప్లవాత్మ మార్పులు, వాతావరణ మార్పుల నేపథ్యంలో పంట వైవిధ్యం అత్యంత అవసరమని అభిప్రాయపడ్డారు.
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రసాయన వ్యవసాయానికి ప్రత్యామ్నాయంగా రైతులు విధిగా సేంద్రీయ సేద్యం వైపు మళ్లాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ బేగంపేట సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్ - సెస్‌లో విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ మోహన్ కందా రాసిన "భారత్‌లో వ్యవసాయం... రైతుల ఆదాయం రెట్టింపులో సమకాలీన సవాళ్లు" పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్, కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి కె.పద్మనాభయ్య, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ డైరెక్టర్ డాక్టర్ జువ్వాడి దేవీప్రసాద్, సెస్ డైరెక్టర్ రేవతి పాల్గొన్నారు.
ఫ్రంట్ లైన్ వారియర్స్ జాబితాలో
దేశంలో 50 శాతం పైగా ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నప్పటికీ... సేద్యం లాభసాటిగా లేకపోవడంతో చాలా మంది రైతులు బయటకొస్తుండటం దురదృష్టకరమని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త విధానాలు అమల్లోకి తీసుకువస్తున్నా... వ్యవసాయ రంగాన్ని అనేక సవాళ్లు వెంటాడుతున్నాయని తెలిపారు. కొవిడ్ నేపథ్యంలో అన్ని రంగాలు వెనకబడిన.. ఒక్క వ్యవసాయ రంగమే తట్టుకుని నిలబడి 3.28 శాతం ఉత్పత్తి పెరిగిందని చెప్పారు. అందుకే రైతులను కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్ జాబితాలో చేర్చాలని కేంద్రానికి సూచించినట్లు తెలిపారు.
''శ్రీకారం" సినిమా
ఆర్థిక వ్యవస్థ కొంతైనా నిలబడగలిగిందంటే అది ఒక్క వ్యవసాయదారుడు వల్లే సాధ్యమైందని కొనియాడారు. యువత గ్రామాలకు తరలి వెళ్లి ఆధునిక సేద్యంలో ఎలా విజయాలు నమోదు చేసుకోవచ్చు అన్న కోణంలో ఇటీవల విడుదలైన "శ్రీకారం" సినిమా స్ఫూర్తిదాయంగా ఉందని తాను ట్విట్టర్ ద్వారా అభినందించానని తెలిపారు.
ఇదీ చూడండి:'కరోనాను ఈజీగా తీసుకోవద్దు.. బీ అలర్ట్'