మాతృ భాషలు కాపాడుకునేందుకు సృజనాత్మక విధానాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. తెలుగు భాషా పరిరక్షణ ప్రజా ఉద్యమంగా రూపుదాల్చాలని ఆకాంక్షించారు. తెలుగు కూటమి సంస్థ ఆధ్వర్యంలో వర్చువల్‌గా జరిగిన భాషాభిమానుల 'అంతర్జాల సదస్సు'లో ఆయన ప్రసంగించారు. మాతృభాష కాపాడుకునేందుకు 5 సూత్రాలను ఉపరాష్ట్రపతి పునరుద్ఘాటించారు. ఇటీవల సుప్రీంకోర్టులో ఆంగ్లంలో తన సమస్య చెప్పుకోలేక ఇబ్బంది పడుతున్న మహిళకు తెలుగులో మాట్లాడే అవకాశం ఇచ్చి... 21 ఏళ్లుగా సాగుతున్న భార్యాభర్తల వివాదం సానుకూల మార్గంలో పరిష్కరించిన చీఫ్ జస్టిస్ ఎన్‌వీ రమణ చొరవను అభినందించారు. సరైన న్యాయం అందాలంటే ప్రజలు తమ సమస్యలు తమ మాతృభాషలో తెలియజేసే అవకాశం ఇవ్వాడాన్ని కొనియాడారు.
భాషా వికాసానికి బాటలు
భారతీయ భాషలు ప్రోత్సహించాలనే సంకల్పంతో ప్రధాని, తెలుగు భాషాభివృద్ధిపై సానుకూలమైన ఆలోచన ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వల్ల భాషా వికాసానికి బాటలు పడుతున్నాయన్నారు. పలు రాష్ట్రాల సీఎంలు తమ ప్రాంతీయ భాషల అభివృద్ధికి కృషి చేయడం శుభపరిణామమని పేర్కొన్నారు. మాతృభాష పరిరక్షణ కోసం వివిధ దేశాలు అనుసరిస్తున్న విధానాల నుంచి స్ఫూర్తి పొందాలని సూచించారు. అన్ని శాస్త్రాలను వారి భాషల్లో చదువుకుంటున్న ఫ్రాన్స్, జర్మనీ, స్వీడన్, రష్యా, జపాన్, చైనా, ఇటలీ, బ్రెజిల్ దేశాలు అభివృద్ధి చెందిన ఆంగ్ల దేశాలతో పోటీ పడుతున్నాయన్నారు.
వెంకయ్యనాయుడు సూచించిన ఐదు సూత్రాలు
- ప్రాథమిక విద్య మాతృభాషలో అందేలా చూడడం
- పరిపాలనా భాషగా మాతృభాషకు ప్రాధాన్యత ఇవ్వడం
- న్యాయస్థాన కార్యకలాపాలు, తీర్పులు మాతృభాషలో అందించడం
- క్రమంగా సాంకేతిక విద్యలో మాతృభాషల వినియోగం పెరగాలి
- ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో కుటుంబ సభ్యులతో తెలుగులోనే మాట్లాడటం
దృష్టి పెట్టాలి