విద్యార్థి నాయకుడి నుంచి ఉపరాష్ట్రపతి స్థాయికి ఎదిగిన వెంకయ్యనాయుడు తన తొలిప్రస్థానాన్ని ఫేస్‌బుక్ ద్వారా పంచుకున్నారు. ఈ రోజు తాను ఉపరాష్ట్రపతి అయినా తన గెలుపు ప్రారంభమైంది ఏపీ నెల్లూరు జిల్లా ఉదయగిరిలోనే అని గుర్తు చేసుకున్నారు. తన రాజకీయ జీవితానికి అదే తొలి మైలురాయి అని చెప్పారు.
'ఎన్టీఆర్ ప్రభంజనంలోనూ నన్ను గెలిపించారు' - latest news of vice president of india
తన రాజకీయ జీవితానికి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలలోని ఉదయగిరే తొలి మైలురాయి అని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. కనెక్ట్ పీపుల్ కార్యక్రమంలో భాగంగా ఫేస్‌బుక్ ద్వారా తన తొలి ప్రస్థానాన్ని ఆయన గుర్తు చేశారు.
'ఆలోచించే మనసు, సంభాషించే నోరు, పర్యటించే కాలు ఊరికే ఉండలేవన్న సామెత నా విషయంలోనూ నిజమైంది. అందుకే ఈ ఏకాంతవాసంలోనూ అందరితో ఫోన్లో మాట్లాడుతున్నా. 'కనెక్ట్ పీపుల్' కార్యక్రమంలో భాగంగా నా రాజకీయ సహచరులు, సహాధ్యాయిలు, ఉద్యమ మిత్రులు, విలేకర్లతో ఫోనులో సంభాషించా. 1977లో ధనెంకుల నరసింహం ఉదయగిరి నియోజకవర్గంలో గ్రామగ్రామానా నన్ను పరిచయం చేశారు. ఆ తర్వాత ప్రజలంతా కులమతాలకతీతంగా స్వాగతం పలుకుతూ నాకు రూ.200, రూ.500 ఇచ్చి ఆశీర్వదించేవారు. 1978లో జిల్లా మొత్తం కాంగ్రెస్ ప్రభంజనం వీచినా ఉదయగిరిలో నన్ను గెలిపించారు. 1983లో ప్రత్యర్థి తరఫు ప్రచారానికి ప్రధాని ఇందిరాగాంధీ వచ్చినా, మరోవైపు ఎన్టీఆర్ ప్రభంజనం వీచినా ఉదయగిరి ప్రజలు నా వైపే ఉండటంతో విజయం సాధించా' అని గుర్తు చేశారు.
మూడోసారి ఉదయగిరి నుంచి కాకుండా ఆత్మకూరు నుంచి పోటీ చేసి ఓడిపోయానని చెప్పారు.అదే జరగకుంటే పార్టీ జాతీయ అధ్యక్షుడిగా అటల్‌జీ, అడ్వాణీజీల మధ్య కూర్చునే అవకాశం దక్కేది కాదేమోనని అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యేగా గెలిచిన సమయంలో ఉదయగిరిలో నేను పలకరించని మనిషి, ఎక్కని గడప లేదంటే అతిశయోక్తి కాదని అన్నారు. ఆ నియోజకవర్గానికి పేరు తేవడంతోపాటు అన్ని రంగాలా అభివృద్ధికి కృషి చేసినట్లు చెప్పారు.