తెలంగాణ

telangana

ETV Bharat / state

పరిశోధన ఫలితాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలి: వెంకయ్య నాయుడు

ఆచార్య ఎన్జీ రంగా... రాజకీయాల్లో విలువలతో కూడిన గొప్ప నేత అని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు కొనియాడారు. ఆచార్య ఎన్జీ రంగా 120వ జన్మదిన వేడుకలు పురస్కరించుకుని హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ఐసీఏఆర్-నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్​మెంట్​-నార్మ్‌ ప్రాంగణంలో జరిగిన వెబినార్‌ సదస్సులో దిల్లీ నుంచి ఉపరాష్ట్రపతి అధ్యక్ష ఉపన్యాసం చేశారు.

పరిశోధన ఫలితాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలి: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
పరిశోధన ఫలితాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలి: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

By

Published : Nov 7, 2020, 3:38 PM IST

ప్రముఖ రైతాంగ నేత, పద్మవిభూషణ్​ పురస్కార గ్రహీత ఆచార్య ఎన్జీ రంగా 120వ జన్మదిన వేడుకలు పురస్కరించుకుని హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ఐసీఏఆర్-నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్​మెంట్​-నార్మ్‌ ప్రాంగణంలో వెబినార్‌ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దిల్లీ నుంచి ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అధ్యక్ష ఉపన్యాసం చేశారు. ఈ కార్యక్రమంలో నార్మ్ డైరెక్టర్ డాక్టర్ చెరుకుమల్లి శ్రీనివాసరావు, ఐఐఆర్‌ఆర్‌ విశ్రాంత డైరెక్టర్ వి.రవీంద్రబాబు, పలువురు శాస్త్రవేత్తలు పాల్గొనగా... ముంబై నుంచి నాబార్డు ఛైర్మన్ డాక్టర్ చింతల గోవిందరాజులు పాల్గొన్నారు.

పరిశోధన ఫలితాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలి: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

ఎన్జీ రంగా జీవితం ఆదర్శవంతం

ఇంటా బయటా వ్యవసాయ రంగం, రైతాంగం వాణి వినిపించిన రంగా జీవితం... ఆయన చూపిన రాజకీయ పాఠాలు అంతా అర్థం చేసుకోవాలని వెంకయ్య నాయుడు సూచించారు. పార్లమెంట్‌లో ఆయన ప్రసంగాలు, ప్రతిపాదనలు స్ఫూర్తిదాయకమే కాకుండా రాజకీయ ప్రత్యర్థులతో విబేధించినా.. ఎలా వ్యవహరించాలో మనకు ఆ రోజుల్లోనే చెప్పారని గుర్తు చేశారు. ఆలోచనల స్థాయి పడిపోయి సిద్ధాంతం తగ్గి రాద్ధాంతం పెరుగుతోందన్నారు. ఈ తరుణంలో రంగా లాంటి మహానీయుల జీవితాలు జ్ఞప్తికితెచ్చుకోవాలని చెప్పారు.

రైతున్నల సమస్యలపై ఆందోళన

అప్పుడే యువతరం, నేటితరం మరింత స్ఫూర్తివంతంగా ప్రజాజీవితంలో ముందుకు వెళ్తుందని విశ్వసిస్తున్నామని ఉపరాష్ట్రపతి చెప్పారు. కొవిడ్-19 నేపథ్యంలో ఒక్క వ్యవసాయం మాత్రమే ముందంజలో ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న చేయూత, అమలు చేస్తున్న పథకాల వల్ల వ్యవసాయం ఎంతో అభివృద్ధి చెందినా... రైతులు ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

వాతావరణ మార్పుల నేపథ్యంలో తుఫాన్లు, భారీ వర్షాలు, వరదలు, కరువు వంటి ప్రతికూల పరిస్థితులు అన్నదాతలను ఇబ్బంది పెడుతున్న తరుణంలో.. కొందరు సేద్యాన్ని వదిలేసి ప్రత్యామ్నాయ వృత్తుల వైపు చూస్తున్నారని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో కూలీల కొరత, సంస్థాగత రుణాలు, నాణ్యమైన విత్తనాలు సరఫరా లేమి, యాంత్రీకరణ, గోదాములు, శీతల గిడ్డంగులు, సమర్థవంతమైన మార్కెటింగ్ వ్యవస్థ లేకపోవడంతో సేద్యం గిట్టుబాటుకాక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఐసీఏఆర్, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు తమ పరిశోధన ఫలితాలు క్షేత్రస్థాయిలోకి చేరివేసి సుస్థిర, లాభసాటి సేద్యం సాకారం చేయాలని శాస్త్రవేత్తలకు వెంకయ్యనాయుడు దిశానిర్దేశం చేశారు.

ఇదీ చదవండి:వ్యర్థాల నుంచి సంపద సృష్టిలో హైదరాబాద్ ఆదర్శం: కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details