తెలంగాణ

telangana

ETV Bharat / state

VENKAIAH NAIDU: 'కొందరు నేతల మాటలు రోత కలిగిస్తున్నాయి' - ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు తీవ్ర ఆవేదన

ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో కొందరు రాజకీయ నేతల మాటల రోత కలిగిస్తున్నాయని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చట్టసభల్లో, బయట ప్రజాప్రతినిధుల మాటల్ని ప్రజలు గమనిస్తుంటారన్న విషయాన్ని గుర్తుంచుకొని మాట్లాడాలని సూచించారు.

Venkaiah Naidu
Venkaiah Naidu

By

Published : Nov 6, 2021, 9:50 AM IST

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఇతర ప్రాంతాల్లో ఇటీవలి కాలంలో కొందరు రాజకీయ నేతల మాటలు రోత కలిగిస్తున్నాయని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలో శుక్రవారం పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఏయూ కన్వెన్షన్‌ కేంద్రంలో ‘శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం’ పూర్వ పీఠాధిపతి ఉమర్‌ అలీషా జీవితచరిత్రను, పార్లమెంటు ప్రసంగాల పుస్తకాలను ఆవిష్కరించారు. 1885-1945 కాలానికి చెందిన ఉమర్‌ అలీషా ఆంగ్లేయుల కాలంలోనే కేంద్ర చట్టసభ సభ్యుడిగా సేవలందించారని గుర్తుచేశారు. యాభైకి పైగా గ్రంథాలను రాసిన ఆయన ఎందరో ఉద్దండులతో కలిసి పనిచేశారని గుర్తుచేశారు. ఇటీవల కొందరి తీరు చూస్తుంటే రాజకీయం ఇంత రోతగా ఉంటుందా అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. చట్టసభల్లో, బయట ప్రజాప్రతినిధుల మాటల్ని ప్రజలు గమనిస్తుంటారన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఆధ్యాత్మిక మార్గం అంటే సేవా మార్గమేనని చాటిచెప్పిన మానవతావాది ఉమర్‌ అలీషా అని అభివర్ణించారు.

‘ఈనాడు’ కృషి ప్రశంసనీయం..

75 ఏళ్ల స్వాతంత్య్రోత్సవాలను పురస్కరించుకుని ‘ఈనాడు’లో నాటి పోరాటయోధుల త్యాగాలను, కృషిని, ఉద్యమాలను కళ్లకు కట్టేలా ప్రతిరోజూ ‘స్వాతంత్య్ర అమృత మహోత్సవం’ పేరిట ప్రత్యేక కథనం ఇస్తున్నారని, దేశవ్యాప్తంగా అన్ని మీడియా సంస్థలు ఆ తరహాలో ఇవ్వాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. నాటి పోరాటాల గురించి ప్రస్తుత తరంలో చాలా మందికి తెలియదన్నారు. విశాఖకు చెందిన లక్ష్మీనరసమ్మ, లింగమ్మ, మహాలక్ష్మమ్మ, నారాయణమ్మ, సోదెమ్మ, శ్యామసుందరమ్మ, తదితర మహిళల నాడు పోరాడారని గుర్తు చేశారు. కార్యక్రమంలో ప్రస్తుత పీఠాధిపతి డాక్టర్‌ ఉమర్‌ అలీషా, మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తదితరులు ప్రసంగించారు.

మాతృభాషలో పదాల వాడుక తగ్గుతోంది..

‘విశాఖ సాహితి’ సంస్థ స్వర్ణోత్సవ సంచికను శుక్రవారం ఏయూలోని వై.వి.ఎస్‌.ఆడిటోరియంలో ఉపరాష్ట్రపతి విడుదల చేశారు. మాతృభాషలో పదాల వాడుక తగ్గిపోతుండటం బాధాకరమన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 8 జిల్లాల్లో 920 పాఠశాలల్లో కోయభాషలో ప్రాథమిక విద్యాబోధన చేస్తున్నారని తెలిసి ఆనందించానని తెలిపారు. ఇందుకు రాష్ట్రప్రభుత్వం, విద్యాశాఖ అధికారుల్ని అభినందించారు. కార్యక్రమంలో ఏయూ ఆచార్య వీసీ ప్రసాద్‌రెడ్డి, విశాఖ సాహితీ అధ్యక్షురాలు ఆచార్య మలయవాసిని ప్రసంగించారు.

ఇదీ చదవండి:Podu land issue in telangana: పోడు భూములపై శాటిలైట్‌ మ్యాప్‌.. ఆ వివరాలు పక్కాగా తేల్చేందుకే!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details