రాష్ట్రవ్యాప్తంగా పశుసంవర్థకశాఖలో ఖాళీగా ఉన్న వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులను అర్హులైన వారితో మాత్రమే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ డిప్లొమా అభ్యర్థులు ఆందోళన నిర్వహించారు. హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని పశు సంక్షేమభవన్ ముందు నిరసన చేపట్టారు. అక్రమ పదోన్నతులను తక్షణమే ఆపేయాలంటూ డిమాండ్ చేశారు.
'అర్హులతోనే వెటర్నరీ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ చేయాలి'
పశుసంవర్థకశాఖలో ఖాళీగా ఉన్న వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులను అర్హులచే భర్తీ చేయాలని డిప్లొమా అభ్యర్థులు ఆందోళనకు దిగారు. అక్రమంగా పదోన్నతులు ఇవ్వడాన్ని తక్షణమే నిలిపివేయాలంటూ మాసబ్‌ట్యాంక్‌లోని పశు సంక్షేమ భవన్‌ను ముట్టడించారు.
వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులను టెక్నికల్ పోస్టుగా గుర్తిస్తూ వెటర్నరీ డిప్లొమా, డెయిరీ, పౌల్ట్రీ, ఎంపీవీఏ కోర్సులను కనీస విద్యార్హతగా నిర్ణయించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో 2013 అక్టోబరు 31వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబరు 34 జారీ చేసిందని గుర్తు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగాలను అటెండర్లకు కట్టబెట్టేందుకు అధికారులు సర్క్యులర్ జారీ చేయడాన్ని తప్పుబట్టారు.
అనంతరం పశుసంవర్థకశాఖ సంచాలకులు డాక్టర్ కె.లక్ష్మారెడ్డితో చర్చించారు. 1993లో నియమితులైనవారికి పదోన్నతులు కల్పించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. అటెండర్ల చేతికి పశువైద్యం అప్పగించడం సరికాదని ఆయనకు వినతిపత్రం సమర్పించారు. ప్రస్తుతం నాలుగోతరగతి ఉద్యోగుల పదోన్నతులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు పశుసంవర్థకశాఖ సంచాలకులు హామీ ఇచ్చినట్లు విద్యార్థి బృందం ప్రతినిధులు తెలిపారు.