ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో వాదాలు పుట్టినప్పటికీ సానుకూల మార్పును ఆకాంక్షించే జాతీయవాద భావనే అంతిమంగా విజయం సాధిస్తోందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. జాతీయ భావజాలానికి వ్యతిరేకంగా ఉన్న వాదాలు, వాదనలన్నీ మెల్ల మెల్లగా నీరుగారి.. తమ అస్తిత్వాన్ని కోల్పోతున్నాయని తెలిపారు. నాటి పరిస్థితులకు అనుగుణంగా రాజకీయ, సాంఘిక, ఆర్థిక సిద్ధాంతాల మూలాలతో పుట్టిన అనేక సిద్ధాంతాలు జాతీయవాద భావనను విస్మరించిన కారణంగా క్రమంగా తమ ప్రభను కోల్పోతున్నాయని అభిప్రాయపడ్డారు.
సామాజిక మార్పుతో పాటు వ్యక్తి నిర్మాణానికి ప్రాధాన్యతనిస్తూ... వ్యక్తికంటే దేశం, సమాజం అత్యున్నతమనే భావనను ముందుకు తీసుకువెళుతున్న జాతీయవాద ఆలోచనలు దినదిన ప్రవర్థమానమౌతున్నాయని తెలిపారు. నారాయణగూడలోని కేశవ మెమోరియల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో జరిగిన కార్యక్రమంలో నవయుగ భారతి ప్రచురించిన ‘స్ఫూర్తి ప్రదాత శ్రీసోమయ్య’ పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. పితృవాత్సల్యంతో తన ఎదుగుదలకు మార్గనిర్దేశం చేసిన సోమయ్య జీవితాన్ని పుస్తకరూపంలో తీసుకురావడం, ఆ పుస్తకాన్ని తాను స్వయంగా ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు.