Venkaiah pay tributes to roshaiah: రాజకీయాల్లో అజాతశత్రువుగా మహోన్నత విలువలకు కట్టుబడి ఉన్న వ్యక్తి రోశయ్య అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొనియాడారు. ప్రజాజీవితంలో సంప్రదాయాలను పాటించిన మహావ్యక్తి అని స్పష్టం చేశారు. హైదరాబాద్ అమీర్‌పేటలోని నివాసంలో దివంగత మాజీ సీఎం కొణిజేటి రోశయ్య చిత్రపటానికి నివాళులర్పించారు. రోశయ్య సతీమణి శివలక్ష్మితో పాటు కుమారులు, కుటుంబ సభ్యులను పరామర్శించారు. రోశయ్యతో తనకు సుదీర్ఘకాలంగా అనుబంధం ఉందన్న వెంకయ్య నాయుడు... తెలుగుదనానికి నిలువెత్తు దర్పణంగా నిలిచారని తెలిపారు.
ఎమ్మెల్యేగా ఉన్నా... మంత్రిగా ఉన్నా.. ఏ రంగంలో ఉన్నా విషయాలను చక్కగా అధ్యయనం చేసి దాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం.. వినేవారిని ప్రభావితం చేయడం ఆయన ప్రత్యేకత. సామాన్యులకు సైతం అర్థవంతంగా చెప్పడం రోశయ్య ప్రత్యేకత. అన్ని సంవత్సరాలు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి బహుశా మరొకరు ఉండరు. ఆర్థిక విషయాల్లో ఆయన ఆరితేరిన దిట్ట అని మనం చెప్పొచ్చు. రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ మేం అనేక విషయాలు మాట్లాడుకునేవాళ్లం. సమకాలీన అంశాల గురించి అభిప్రాయాలు చెప్పుకునేవాళ్లం.