ట్యాంక్‌బండ్(Tank Bund)పై ట్రాఫిక్ సమస్యతో సందర్శకులు ఇబ్బంది పడుతున్నందున ప్రతి ఆదివారం ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) విధిస్తున్నట్లు హైదరాబాద్ సీపీ వెల్లడించిన నేపథ్యంలో ఇవాళ్టి నుంచి ఆంక్షలు అమలులోకి వచ్చాయి. ట్యాంక్ బండ్‌పై సాయంత్రం 5 నుంచి రాత్రి 10 వరకు వాహన రాకపోకలు బంద్ అవుతాయి. సందర్శకుల కోసం పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇవాళ్టి నుంచి ప్రతి ఆదివారం ఆంక్షలు కొనసాగుతాయని పోలీసులు ఇదివరకే వెల్లడించారు.
ట్యాంక్‌బండ్ వద్ద హుస్సేన్ సాగర్ (Hussain Sagar) అందాలు కనువిందు చేస్తుండగా.. మరోవైపు విగ్రహాలతో పాటు... చిన్నపాటి ఉద్యానవనాలు ఏర్పాటు చేశారు. అయితే ఈ మార్గంలో వాహనాల రాకపోకల వల్ల సందర్శకులు రోడ్డు దాటడం ఇబ్బందిగా మారింది. ఈ సమస్యను ఇటీవల ఓ నెటిజన్ ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యను పరిష్కరించాల్సిందిగా కేటీఆర్... హైదరాబాద్ పోలీసులకు కోరారు.