లాక్‌డౌన్ కొనసాగుతున్న తరుణంలో నిబంధనలు పాటించని వాహనదారులపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. అనవసరంగా వాహనాలతో రోడ్లపైకి వస్తే చర్యలు తీసుకుంటున్నారు. వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తున్నారు. సీజ్ చేసిన వాహనాన్ని పోలీస్‌స్టేషన్‌లలో, చెక్‌పోస్టుల వద్ద ఉంచుతున్నారు. రోజుల తరబడి అవి అక్కడే ఉంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే సుమారు లక్షన్నర వరకు వాహనాలను పోలీసులు జప్తు చేశారు. లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తేస్తే తప్పా... వాటికి మోక్షం లభించే అవకాశం లేదు. ఆంక్షలను సడలించిన తర్వాత ఆయా ఠాణాల పోలీసులు వాటిని న్యాయస్థానాల్లో డిపాజిట్ చేయనున్నారు.
జరిమానా చెల్లించిన తర్వాతే..
అంటువ్యాధుల వ్యాప్తి నిరోధక చట్టం కింద రూ. 500 నుంచి 2,000 వరకు జరిమానా చెల్లించిన తర్వాతే వాహనాన్ని తిరిగి తీసుకోవచ్చు. సగటున రూ. 1000 అనుకున్నా ఇదే దాదాపు రూ.14.6 కోట్లు కానుంది. దీనికి తోడు రోజుల తరబడి ఒకే చోట కదలకుండా ఉండటం వల్ల వేలల్లో మరమ్మతుల భారం అదనం అయ్యే అవకాశం ఉంది. లాక్‌డౌన్ సమయంలో అనవసరంగా బయటికి వెళ్లి వాహనాన్ని పోలీసులకు సమర్పించుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు.