Vehicles are More than Families in Telangana: రాష్ట్రంలో ఏటేటా వాహనాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ప్రస్తుతం కుటుంబాల సంఖ్యను మించి పోయింది. తెలంగాణలో ఇరవై లక్షల కుటుంబాలు ఉంటే.. వాహనాల సంఖ్య మాత్రం కోటీ యాభై మూడు లక్షలు దాటింది. తెలంగాణ రవాణా శాఖ తాజా గణాంకాల ప్రకారం.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటికి 71.52 లక్షల వాహనాలు తెలంగాణలో ఉన్నాయి. అదే ఈ సంవత్సరం ఫిబ్రవరి నాటికి వాటి సంఖ్య 1.53 కోట్లు దాటగా.. అందులో బైకులు 73.7 శాతం ఉండగా.. కార్లు 13 శాతంగా ఉన్నాయి. వీటి తర్వాతి స్థానం ట్రాక్టర్లదే. ఒకవైపు వ్యక్తిగత వాహనాలు విపరీతంగా పెరుగుతుండగా.. ప్రజా రవాణాకు సంబంధించి ఆర్టీసీ బస్సులు మాత్రం తగ్గుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 10,479 నుంచి 9,164కి అంటే 12.5 శాతం బస్సులు తగ్గాయి.
ఇదిలా ఉంటే వాహనాల అమ్మకాలు, రిజిస్ట్రేషన్లతో రవాణా శాఖకు భారీ ఆదాయం సమకూరుతోంది. గత తొమ్మిదేళ్లలో 320 శాతం, నిరుటితో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 52 శాతానికి పైగా ఆదాయం పెరిగిట్లు తెలుస్తోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇదే రికార్డు. నూతన రాష్ట్రంలో సంపద సృష్టి, కుటుంబాల ఆదాయంలో పెరిగిన వృద్ధి ఫలితంగానే వాహనాల సంఖ్య పెరుగుతోందని ఆ శాఖ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.