తెలంగాణ

telangana

ETV Bharat / state

హెల్మెట్‌ లేకుంటే వాహనం స్వాధీనం

రోడ్డు ప్రమాదాల్లో అధికమవుతున్న మృతుల సంఖ్యను గణనీయంగా తగ్గించడానికి సైబరాబాద్‌ పోలీసులు సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. జాతీయ రహదారులపై ప్రయాణించే ద్విచక్ర వాహనదారులు ఇకపై శిరస్త్రాణం తప్పనిసరి ధరించాల్సిందేనని స్పష్టం చేశారు. లేనివారిని నిలిపేసి అప్పటికప్పుడు కొత్త శిరస్త్రాణం కొనుగోలు చేయించి ధరింపజేశాకే వదలాలని నిర్ణయించారు.

hyderabad
హెల్మెట్‌ లేకుంటే వాహనం స్వాధీనం

By

Published : Jan 8, 2021, 7:31 AM IST

సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో గత ఏడాది తీవ్ర ప్రమాదాలు 663 జరిగితే 700 మంది చనిపోయారు. వీరిలో హెల్మెట్‌ లేకుండా ద్విచక్ర వాహనదారులపై ప్రయాణిస్తున్న వారే 400 మంది ఉన్నారు. శిరస్త్రాణం ధరించి ఉంటే వీరిలో 300 మంది బతికి బట్టకట్టేవారని తమ పరిశీలనలో తేలిందని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ విభాగం డీసీపీ విజయకుమార్‌ ‘ఈనాడు’కు తెలిపారు. ఈ ప్రమాదాలన్నీ చాలా వరకు జాతీయ రహదారులపైనే జరిగినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో కొన్నాళ్లుగా సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో హెల్మెట్ల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. లేనివారికి చలానా రాస్తున్నారు. వేలాది మంది చలానాలను చెల్లించకుండా నిర్లక్ష్యంగా తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో శిరస్త్రాణం లేని వారి విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాలని సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ నిర్ణయించి, అమల్లోకి తీసుకొచ్చారు.

సైబరాబాద్‌ పరిధిలో ఈ మార్గాల్లో...

  • రాజీవ్‌ రహదారి...
  • షాద్‌నగర్‌- రాజేంద్రనగర్‌
  • సుచిత్రా- మెదక్‌ కమిషనరేట్‌ పరిధి వరకు
  • మూసాపేట్‌- ఇక్రిశాట్‌
  • కడ్తాల్‌- ఆమనగల్లు మధ్య

తొలుత ఇబ్బందైనా.. తరవాత అలవాటవుతుంది

నాలుగు జాతీయ రహదారులపైకి శిరస్త్రాణం ధరించకుండా ఎక్కిన వారి వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నారు. వెంటనే హెల్మెట్‌ కొన్నా, తెచ్చుకున్నా వాహనదారునిపై ఎటువంటి కేసు నమోదు చేయరు. వాహనంతో సహా వదిలేస్తారు. వారం రోజుల్లో ఈ విధానాన్ని మరింత కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు. తొలుత వాహనదారులు ఇబ్బందులుపడినా తరవాత అలవాటుగా మారుతుందని భావిస్తున్నారు. జాతీయ రహదారులపై వచ్చే ఫలితాలు చూసిన తరువాత అన్ని రోడ్లపై అమలు చేయాలనుకుంటున్నారు.

ప్రాణాలను రక్షించడమే ధ్యేయం

శిరస్త్రాణం లేకుండా వాహనం నడిపి, ప్రమాదాల బారిన పడి వందల మంది ప్రాణాలను పోగొట్టుకున్నారు. వేలాది కుటుంబాలు ఆధారాలు కోల్పోయాయి. భవిష్యత్తులో ఈ పరిస్థితులు నివారించడానికే ప్రతి ఒక్కరూ శిరస్త్రాణం ధరించాలన్న నిబంధనను కఠినంగా అమలు చేస్తున్నాం.

- వీసీ సజ్జనార్‌, సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌

ABOUT THE AUTHOR

...view details