Vegetables are sold at high prices: సాధారణంగా రైతుబజార్‌లో ప్రతి కూరగాయ లభిస్తుంది. ధర సైతం తక్కువగా ఉంటుంది, అయితే హైదరాబాద్‌లోని రైతుబజార్లలో మాత్రం విచిత్ర పరిస్థితి నెలకొంది. రోడ్లపై యథేచ్చగా అమ్ముతున్న టమాట.. కొన్ని రైతుబజార్‌లలో కనిపించక వినియోగదారులు కంగుతింటున్నారు. మార్కెట్‌లలో టమాట దొరకకపోవటం ఏంటని ఆశ్చర్యపోతున్నారు. హైదరాబాద్ చుట్టు పక్కల ప్రాంతాలైన రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి మార్కెట్‌లకు టమాట సరఫరా అవుతుంది. పండగ సీజన్ కావడంతో కూలీల దొరక్క టమాట రాలేదని కూరగాయల వ్యాపారస్థులు అంటున్నారు.
రైతుబజార్లలో ఇష్టారాజ్యంగా ధరలు:మిగతా కూరగాయలైన బీన్స్, క్యారెట్, బీట్‌రూట్, క్యాప్సికం, సొరకాయ, కాకరకాయ వంటి కూరగాయలు, పుదీనా, కొత్తిమీర, ఇతర ఆకుకూరల ధరల్లో హెచ్చతగ్గులు వినియోగదారుల్ని ఇబ్బంది పెడుతున్నాయి. పేరుకు రైతులుగా చెలామణి అవుతూ రైతుబజార్లలో వ్యాపారులు, దళారులే ఇష్టారాజ్యంగా ధరలు పెంచుతున్నారని వినియోగదారులు అంటున్నారు. బోర్డులపై రాసున్న ధరలకు భిన్నంగా విక్రయాలు జరుపుతున్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.