Veda Rajani assumes TSWC chairperson : గుండెపోటుతో ఆకస్మిక మరణం చెందిన వేద సాయిచంద్ భార్య వేద రజనీ.. తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్‌పర్సన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ నాంపల్లిలోని ఆ సంస్థ కార్యాలయంలో ఆమె బాధ్యతలు చేపట్టారు. దస్త్రంపై తొలి సంతకం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, వి.శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తదితర నేతలు హాజరయ్యారు.
తన భర్త సాయిచంద్ ఆశయాలు ముందుకు తీసుకెళతానని రజని అన్నారు. తన భర్త కన్నుమూసిన వార్త విన్న తర్వాత తమపై సానుభూతి చూపకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ తన దత్తపుత్రుడు సాయిచంద్ అని కుటుంబానికి పూర్తి స్థాయిలో అండగా ఉంటానని ఆత్మస్థైర్యం ఇచ్చారని తెలిపారు. తండ్రిలా కొండంత అండగా ఉన్న సీఎం ఆదేశాల మేరకు ఆయన అడుగుజాడల్లో నడుస్తూ తనకు అప్పగించిన బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వహిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థను అభివృద్ధిపథంలో తీసుకెళ్లి రైతులకు అండగా ఉంటానని ఆమె పేర్కొన్నారు.
గిడ్డంగుల సంస్థ ఛైర్మన్‌గా వ్యహరించిన వేద సాయిచంద్ ఇటీవల గుండెపోటుతో కన్నుమూసిన నేపథ్యంలో.. ఆ స్థానంలో ఛైర్మన్‌గా ఆయన సతీమణి రజనిని ప్రభుత్వం నియమించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సాయిచంద్ సేవలకు గుర్తింపుగా సముచితం గౌరవం ఇవ్వాలన్న నిర్ణయం నేపథ్యంలో రజనికి ఆ సంస్థ ఛైర్మన్‌గా అవకాశం కల్పించడం విశేషం. అనంతరం.. తెలంగాణ రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన మఠం భిక్షపతికి మంత్రులు శుభాకాంక్షలు తెలియజేశారు.