వాస్తు నిపుణుల సూచనల మేరకు గాంధీభవన్‌లో పలు మార్పులు చేర్పులు చేపట్టారు. టీపీసీసీ నాయకుడు వేణు ఆధ్వర్యంలో వాస్తు నిపుణులు.. గాంధీ భవన్‌ను సందర్శించి లోపల, వెలుపల, పరిసరాలను పరిశీలించారు. ఎక్కడెక్కడ ఎలాంటి మార్పులు చేయాలో సివిల్ కాంట్రాక్టర్‌కు సూచించారు.
మొదటగా చిన్నచిన్న మరమ్మతులు
పీసీసీ అధ్యక్షుడి ఛాంబర్‌ను మార్చడం, ఇప్పుడు నడుస్తున్న దారి బదులు మరొక దారిని సూచించారు. రేవంత్ పదవీ బాధ్యతలు చేపట్టేందుకు సమయం కేవలం మూడు రోజులే ఉండటంతో సివిల్ పనులు జోలికి వెళ్లకూడదని నిర్ణయించారు. గాంధీ భవన్ లోపల, బయట అంత శుభ్రం చేయడం, దారికి అడ్డంగా ఉన్న గదులను కూల్చివేయడం, గాంధీ విగ్రహం వద్ద పాడైన ఫ్లోరింగ్ వేయడం, చెట్లను ట్రిమ్ చేయడం, భవంతికి రంగులు వేయడం లాంటి వాటితోపాటు చిన్న చిన్న మరమ్మతులు పూర్తి చేస్తారు. ఈనెల 6వ తేదీ సాయంత్రం వరకు చేయగలిగినవి చేస్తారు. గాంధీ భవన్ లోపల అంతర్గతంగా చెయ్యాల్సిన మార్పులు, చేర్పులు బాధ్యతలు తీసుకున్న తర్వాత చేపడతారని రేవంత్ రెడ్డి తరఫున పనులను పర్యవేక్షణ చేస్తున్న టీపీసీసీ నాయకులు వేణు తెలిపారు.