తల్లిదండ్రులు పిల్లలపై చూపించే వాత్సల్యం వెల కట్టలేనిది. మాటలకు అందనిది. అయితే రకరకాల కారణాలతో కొంతమంది చిన్నారులు...తమ కన్నవారి ప్రేమకు దూరమవుతుంటారు. అక్కున చేర్చుకునే ఆత్మీయుల లేక అనాథలుగా మారుతుంటారు. అలాంటి వారికి అమ్మనాన్నల ప్రేమను తలపించే అనురాగం అందిస్తు, విద్యను నేర్పిస్తూ ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతోంది... హైదరాబాద్‌కు చెందిన వాత్సల్యం ఫాండేషన్. హైదరాబాద్ నాగోల్‌లో 2007లో వాత్సల్యం ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశాడు..రాఘవేంద్ర. కన్నవారికి దూరమై...వీధుల్లో ఒంటరిగా భారమైన జీవితాలు గడుపుతున్న వందలాది మంది అనాథల్ని అక్కున చేర్చుకున్నాడు. వాత్సల్యం ఫాండేషన్ ద్వారా పిల్లలకు విద్యాబుద్దులు నేర్పించాడు. వారికి మంచి జీవితాన్ని అందించాడు. ఎవరూ లేని ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసి ఒక ఇంటివారిని చేశాడు.
పెళ్లి కూడా చేసుకోలేదు
అనాథాశ్రమం అంటే ఆకలి తీర్చి, ఆశ్రయం కల్పించటమే కాదు.. వారికి మెరుగైన వసతులు అందించాలి. వారి కాళ్ల మీద వారు నిలబడేందుకు వారధిగా నిలిచే విద్యను అందించాలనేది రాఘవేంద్ర నమ్మిన సిద్ధాంతం. అందుకు తగ్గట్లే విశాలమైన భవనం అద్దెకు తీసుకొని వారికి సకల సౌకర్యాలు కల్పించాడు. పిల్లలను ప్రైవేటు పాఠాశాలల్లో చేర్పించి పోటీ ప్రపంచానికి అనుగుణంగా చదువు చెప్పిస్తున్నాడు. స్కూల్ వ్యాన్ సహా ట్యూషన్ మాస్టర్‌ను నియమించాడు. విద్యతో పాటు సాంస్కృతిక, క్రీడా విభాగాల్లో రాణించేలా ప్రోత్సాహిస్తున్నాడు. వాత్సల్యం ఫాండేషన్‌ను దాతలు, ఉద్యోగస్తులైన తన స్నేహితుల సహకారంతో రాఘవేంద్ర ఇన్నాళ్లు ఏ లోటు లేకుండా నడిపించాడు. పిల్లల సంరక్షణకు ప్రాధాన్యం ఇచ్చి పెళ్లి కూడా చేసుకోలేదు. ఇక్కడ ఉండే ప్రతి ఒకరి పుట్టినరోజును ఘనంగా చేసి..అనాథలనే భావనను వారి నుంచి దూరం చేసేవాడు. ఎవరూ లేని అభాగ్యులకు అన్నగా నిలబడి...వారు అన్నివిధాల జీవితంలో ఎదిగేందుకు వారథిగా నిలుస్తున్నాడు.