ఎదురుగా కనిపించే బొమ్మయినా... ప్రకృతిలోని అందాలైనా వరుణ్ కంటపడితే తన చేతిలోని కుంచె చకచకా కదులుతుంది. సృష్టికి ప్రతిసృష్టి చేసినట్లుగా కాన్వాస్ పై చిత్రాలుగా మారిపోతాయి. బొమ్మలు గీయటమే కదా..! ఇందులో ప్రత్యేకత ఏముంది అనుకోవద్దు. ఎందుకంటే వరుణే ఒక ప్రత్యేకమైన వ్యక్తి. వెన్నుపూస సమస్య కారణంగా తక్కువ మెడతో జన్మించాడు.
వెన్నుపూస సమస్య కారణంగా వరుణ్ మూడేళ్ల వరకూ కనీసం నిలబడలేని పరిస్థితి. దీనికి తోడు అతడికి వినపడదు. అయినా అతని తల్లిదండ్రులు కుంగిపోలేదు. వరుణ్‌కు అన్ని విషయాల్లో అండగా నిలిచారు. స్పీచ్ థెరపీ ద్వారా ఎదుటివారు చెప్పేది అర్థం చేసుకోవటం, తిరిగి చిన్నచిన్న మాటలతో సమాధానం ఇవ్వటం నేర్పించారు.
తల్లిదండ్రుల ప్రోత్సాహమే
వరుణ్ తండ్రి ఆంధ్రా యూనివర్శిటీ ప్రొఫెసర్‌గా పని చేసేవారు. తాను రాసుకుంటున్నప్పుడు టేబుల్ పై ఉన్న పెన్సిల్ తీసుకుని వరుణ్ పేపర్ పై గీతలు గీయటం మొదలు పెట్టాడు. పాఠశాలలో చేర్పించిన తర్వాత చదువుతో పాటు... బొమ్మలు గీయడం మెుదలుపెట్టాడు. వరుణ్ ఆసక్తి చూసి తల్లిదండ్రులు ఆ దిశగా ప్రోత్సహించారు. విశాఖపట్నంలోని బీచ్ వద్దకు రోజూ తీసుకెళ్లేవారు. వరుణ్ అక్కడి ప్రకృతి అందాలను చూసి చిత్రాలుగా మలిచేవాడు.
మనుషుల చిత్రాలు
ఆ తర్వాత ఎదురుగా ఉన్న మనుషుల్ని కూడా చిత్రీకరించటం మొదలుపెట్టాడు. తనను దేవుడు మెడ లేకుండా పుట్టించినా... తాను గీసే చిత్రంలో మాత్రం మెడతో తాను ఎలా ఉంటాలో గీసి మురిపోతున్న వరుణ్‌ని చూస్తే ఎవ్వరికైనా ముచ్చటేయాల్సిందే.