Varalakshmi Vratham 2022: శ్రావణమాసం వచ్చిందంటే... కొత్తకోడళ్ల నోములూ, మహిళల వ్రతాలూ... ముత్తయిదువుల వాయనాలూ... ఇలా ఒకటా రెండా, ఈ నెల అంతా తెలుగు లోగిళ్లన్నీ సందడి సందడిగా ఉంటాయి. ప్రతిమహిళా శ్రావణలక్ష్మిగా ముస్తాబై అమ్మవారిని ఆహ్వానిస్తూ పూజలు చేసుకుంటుంది. అప్పట్లో కొంతమంది పీటపైన ఉంచిన కలశాన్నే అమ్మవారిగా కొలుస్తూ వరలక్ష్మీవ్రతాన్ని చేసుకునేవారు. మరికొంతమంది దేవి ఫొటోను పెట్టుకుంటే... ఇంకొందరు కలశం మీదనే పసుపు ముద్దతో అమ్మవారి ముఖాన్ని చేసుకుని పూజించేవారు.
కానీ ఇప్పుడు ఆ శ్రీమహాలక్ష్మి ముఖాలూ, నిలువెత్తు రూపాలూ దొరుకుతున్నాయి. సిరుల తల్లి నిజంగానే మన ఇంట్లో కొలువుదీరిందా అన్నట్లుగా ఉంటున్నాయి ఇవన్నీ కూడా. తలపైన కిరీటం, మెడలో నగలూ, పట్టుచీరా, పొడవైన జడా... ఇలా ప్రతిదీ చక్కని అలంకరణలతో వచ్చే అమ్మవారి ప్రతిమల్ని నేరుగా కొనేసుకోవచ్చు. లేదూ... అందరి కన్నా భిన్నంగా ఉండాలనుకుంటే మీ ఇంటి లక్ష్మీదేవిని మీరే తయారుచేసుకోవచ్చు. అందుకోసం మార్కెట్లో అమ్మవారి నగలూ, చీరలూ అమ్ముతున్నారు. గాజులూ, కిరీటాలూ, జడ బిళ్లలూ, వంకీలూ, వడ్డాణాలూ, హారాలూ... చిన్నచిన్న సైజుల్లో సెట్లుగా దొరుకుతున్నాయి.వీటితో దేవిని స్వయంగా అలంకరించుకోవచ్చు. ఏటికేడు శ్రావణలక్ష్మిని ప్రత్యేకంగా తయారుచేసుకోవచ్చు.
ఇవి పూజా తెరలు!చూసిన వెంటనే పర్వదినం శోభ ఉట్టిపడేలా దేవి ప్రతిమ వెనకాల పూల దండలో, మామిడాకుల తోరణాలో పెట్టడం అమ్మమ్మల కాలం నుంచీ ఉన్న పద్ధతే. వాటికి అదనంగా ఈ డెకరేటివ్ యుగానికి తగ్గట్టు పూజలోనూ ఆ ఏర్పాట్లు ఉండాలి కదా. అందుకే మరి పెద్ద పెద్ద వేడుకలకూ, ఫంక్షన్లకూ వేసే బ్యాక్ డ్రాప్ కర్టెన్లు పండుగల కోసమూ అందుబాటులోకి వచ్చాయి. వరలక్ష్మి చిత్రాలూ, రంగవల్లులూ, అరిటాకులూ, పువ్వులూ, దీపాల డిజైన్లూ... ఇలా ఎన్నెన్నో థీమ్‌లతో రకరకాల తెరలు దొరుకుతున్నాయి. త్రీడీ ప్రింట్లతో ఉండే ఇవి చిన్న సైజుల్లోనూ ఉన్నాయి. కొన్ని క్లాత్‌తో చేసినవి ఉంటే ఇంకొన్ని స్టిక్కర్లలానూ ఉంటాయి. మన అవసరానికి తగ్గట్టు కొనుక్కోవచ్చు. సమయం ఉన్నప్పుడు రకరకాల పూలనీ, ఆకులనీ దండలుదండలుగా కట్టి అలంకరించడం మామూలే కానీ సమయం లేకపోయినా వీటితో క్షణాల్లో అలాంటి డెకరేషన్ తెప్పించేయొచ్చు.
ముస్తాబైన కలశం!ఇంట్లో జరిగే అన్ని శుభకార్యాల్లో, పూజల్లో కలశానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. పసుపు, కుంకుమలతో చుట్టూ బొట్లు పెట్టి కలశాన్ని తయారుచేసుకుంటారు. నీళ్లూ, మామిడాకులూ, కొబ్బరికాయా ఉంచి కొలుస్తారు. ఇదివరకు రాగీ, ఇత్తడీ పాత్రలే కలశ పాత్రలుగా ఉండేవి. కానీ ఇప్పుడు ఎన్నో రెడీమేడ్ కలశాలు వచ్చేశాయి. అంటే వట్టి పాత్రలు కాకుండా... గణపయ్యా, లక్ష్మీదేవీ విగ్రహాలతోపాటూ కొబ్బరికాయా, ఆకులతో చేసిన కలపా, వెండీ, బంగారూ, ముత్యాల కలశాలు దొరుకుతున్నాయి. అందంగా తయారైన ఈ కలశాల్ని నేరుగా పూజలో పెట్టేసుకోవచ్చు. చూడ్డానికీ ఎంతో బాగుంటాయి!
లక్ష్మీ దివ్వెలు!పూజలో ఇత్తడితోనో లేదా వెండితోనో చేసిన దీపపు కుందుల్లో నూనె వేసి ‘దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వ తమోపహమ్.....’ అంటూ దేవిని తలుచుకుంటూ వత్తుల్ని వెలిగిస్తుంటారు. దీపపు జ్యోతుల్ని లక్ష్మీదేవీ స్వరూపంగా భావిస్తుంటారు. మరి అదే మహాలక్ష్మీ రూపం దీపాల్లోనే నేరుగా సాక్షాత్కరిస్తే... ఎంతో అద్భుతంగా ఉంటుంది కదూ! ఆ అద్భుతాన్ని మీ వ్రతంలోనూ చూపాలనుకుంటే... ఇలా దీపపు కుందుల్ని అలంకరించుకోండి. పట్టుచీరతో చక్కగా కుచ్చిళ్లు పెట్టి నచ్చిన నగల్ని వేశారంటే దీపమే మహాలక్ష్మిగా కాంతులీనుతూ వచ్చిన అతిథుల్ని ఆకట్టుకుంటుంది. ఈ శ్రమ అంతా ఎందుకూ అనుకుంటే... అమ్మవారి ముఖాలూ, ముత్యాలూ, పూసలూ, రకరకాల పూలతో అలంకరించిన దీపాలూ నేరుగా మార్కెట్లోనూ దొరుకుతున్నాయి. ఇదివరకే ఉన్న దేవుడి రూపాల దీపాలకు బదులు ఈసారి ఈ వరలక్ష్మి అలంకరణలోని దీపపు కుందుల్ని మీ పూజలో భాగం చేసుకోండి మరి.