Vande Bharat Express : తెలుగు రాష్ట్రాల్లో తొలి వందేభారత్ రైలు సంక్రాంతి నాడు పట్టాలెక్కింది. దేశీయంగా తయారైన ఈ సెమీ స్పీడ్ రైలు.. సోమవారం నుంచి రెగ్యులర్‌గా సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య పరుగులు తీస్తుంది. సికింద్రాబాద్‌లో పరుగు ప్రారంభించిన ఈ రైలుకు దారి పొడవునా అపూర్వ స్వాగతం లభించింది. వందేభారత్ రైలు ఎన్నో ప్రత్యేకతలతో ప్రయాణికుల మనసు దోచింది. ఇందులో విమానాలలో ఉండే సీట్లను ఏర్పాటు చేశారు. ఎగ్జిక్యూటివ్ కోచ్‌లో సీట్లను 180 డిగ్రీల కోణం వరకు తిప్పుకోవచ్చు. ఫుల్లీ సస్పెండెడ్ ట్రాన్సాక్షన్ మోటార్‌తో రూపొందించిన ఆధునిక భోగీలు అమర్చడం వల్ల.. రైలు ఎంత వేగంగా వెళ్లినా కుదుపులు ఉండవు. గరిష్ఠంగా 180 కిలోమీటర్ల వేగాన్ని అందుకునేలా డిజైన్ చేసిన ఈ రైలు.. ప్రస్తుతం గంటకు 130 కిలోమీటర్లు వేగంతో దూసుకుపోతోంది. ఈ అత్యాధునిక సౌకర్యాల పట్ల ప్రయాణికుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
"ఈ రైలులో మొదటి ప్రయాణ అనుభవం చాలా బాగుంది. అది విశాఖపట్టణంలో రావటం నాకెంతో సంతోషంగా ఉంది. సికింద్రాబాద్ నుంచి రావటానికి టైమ్ తగ్గింది. సీటింగ్, ఇతర ఏర్పాట్లు బాగున్నాయి. ఇండియాలో ప్రయాణం చేసినట్లు కాకుండా విదేశాలలో ప్రయాణించినట్లు అనిపించింది."-ప్రయాణికురాలు, విశాఖపట్టణం
వందేభారత్ రైలును అందరికీ పరిచయం చేసేందుకు రైల్వే శాఖ విస్తృత చర్యలు చేపట్టింది. ప్రతి డివిజన్‌లోనూ పాఠశాలల విద్యార్థులకు అవగాహన పోటీలు నిర్వహించింది. అందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ అలాగే.. రైల్వే నిర్వహణలో ఉన్న కేంద్రీయ విద్యాలయాల విద్యార్థులకు.. తొలిరోజు రైలులో ప్రయాణించే అవకాశం కల్పించింది. వీరితోపాటు లోకో పైలట్ ట్రైనీలకూ ప్రయాణించే అవకాశమిచ్చింది. విజయవాడ, రాజమహేంద్రవరం సహా ఇతర స్టేషన్లలో రైలు ఎక్కిన విద్యార్థులు విశాఖ వరకూ ప్రయాణించారు. అందులోని సదుపాయాలు, అత్యాధునిక సాంకేతికను చూసి వారెవ్వా అని సంబరపడ్డారు. ఇంతటి సౌకర్యవంతమైన రైలు ప్రయాణాన్ని ఎప్పుడూ అనుభవించలేదంటూ విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు.