అత్యాధునిక హంగులు.. విమాన తరహా ప్రయాణ అనుభూతిని కలిగించే వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. దక్షిణ మధ్య రైల్వేకు మంజూరయ్యింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్‌కు శుక్రవారం అధికారికంగా సమాచారం అందింది. దేశంలో ఇప్పటి వరకు ఐదు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు పట్టాలు ఎక్కాయి. కాగా ఇది ఆరోది. ఈ రైలు గరిష్ఠ వేగ సామర్థ్యం గంటకు 180 కిలోమీటర్లు. బయల్దేరిన రెండు నిమిషాల్లోనే 160 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ప్రస్తుతం సికింద్రాబాద్-విజయవాడ మధ్య కాజీపేట మార్గంలో ట్రాక్ గరిష్ఠ వేగ సామర్థ్యం గంటకు 130 కి.మీ.
సికింద్రాబాద్-గుంటూరు వయా నల్గొండ మార్గంలో గరిష్ఠ వేగం 110 కి.మీ. వందేభారత్ కోసం ప్రస్తుత ట్రాక్ సామర్థ్యాన్ని 180 కి.మీ. గరిష్ఠ వేగానికి పెంచాల్సి ఉంటుంది. డిసెంబరులోనే ఈ రైలును ప్రారంభించేందుకు రైల్వేశాఖ సన్నాహాలు చేస్తోంది. అన్నీ ఏసీ బోగీలుండే ఈ రైల్లో శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో ఖరీదైన ‘అనుభూతి’ కోచ్ టికెట్ల కంటే ఎక్కువ ఛార్జీ ఉంటుంది.
రైల్వే మంత్రితో చర్చించిన కిషన్‌రెడ్డి:రాష్ట్రానికి, దక్షిణ మధ్య రైల్వే జోన్‌కు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు మంజూరులో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి చూపిన చొరవ ఫలించింది. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి, విశాఖపట్నానికి వందే భారత్ రైళ్లు కావాలని రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ని కొద్దివారాల క్రితం స్వయంగా కలిసి కోరారు. మూడు రోజుల క్రితం కూడా రైల్వేమంత్రిని మరోసారి కలిసి చర్చించారు.