వ్యాపారం సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని.. అది విలువలతో కూడుకొని ఉండాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య సూచించారు. ఏపీలోని విశాఖపట్టణం నుంచి వైపీవో గ్రేటర్ చాప్టర్కు చెందిన యువ పారిశ్రామికవేత్తలనుద్ధేశించి అంతర్జాల మాధ్యమం ద్వారా ఆయన ప్రసంగించారు. వ్యాపారం సంపాదన కోసమే అయినా..ఆరోగ్యం కూడా అత్యంత కీలకమన్నారు. అదే సమయంలో సంపాదనలో కొంత భాగం సమాజానికి కూడా కేటాయించి, ప్రజల అభ్యున్నతి కోసం పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ మధ్యకాలంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనల కారణంగా వ్యాపార రంగం అంటే ఓ ప్రతికూల భావన ఏర్పడిన మాట వాస్తవమేనని..దాన్ని పోగొడుతూ అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ పరిస్థితిని మార్చేందుకు యువత ముందుకు రావాలన్నారు.
భారతీయ ధర్మం మనకు నేర్పిందదే...
సేవ చేయటంలో ఉన్న ఆనందం మరెందులోనూ లభించదని వెంకయ్య వ్యాఖ్యానించారు. నలుగురి మేలును కోరుకోవటం భారతీయ ధర్మం మనందరికీ నేర్పిందన్నారు. భారతదేశం ఎవరి మీద దాడులు చేయలేదని.. మన విజ్ఞానాన్ని నలుగురికి పంచేందుకు విశ్వగురువుగా నాయకత్వం వహిస్తూ దిశానిర్దేశం చేసిందన్నారు. ఎవరిపైనా ఆధిపత్యం చెలాయించకుండా వసుధైక కుటుంబ భావనతో విశ్వమంతా మన కుటుంబంగానే భావించే గొప్ప సంస్కృతి మన సొంతమని తెలిపారు. ఆ విలువలే నేటికీ భారతదేశాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్నత దేశంగా నిలబెట్టాయన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది భారతీయులు ఉన్నత స్థానాల్లో ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
మాతృభాషను మరువరాదు