ప్రేమ... ఈ పదం ఎందరికో మధురానుభూతిని అందిస్తుంది. ఇందుకు గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా ఏటా ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. యువతీయువకులు ఆ రోజున ప్రేమలో మునిగితేలుతారు. ఇష్టమైన వారు పక్కన లేకపోయినా.. వారి ఊహల్లో మైమరిచిపోతారు. అయితే ఇండోనేషియా, పాకిస్తాన్, సౌదీ అరేబియా, ఇరాన్ దేశాలు మాత్రం వాలంటైన్స్ డేకు దూరంగా ఉంటున్నాయి. స్వేచ్ఛకు ప్రతిబింబమని చెప్పుకొనే అమెరికా ఫ్లోరిడా రాష్ట్రంలోనూ ప్రేమికుల రోజుపై నిషేధం ఉంది.
ముస్లింలు అధికంగా ఉన్న దేశాలైన పాకిస్తాన్, సౌదీ అరేబియాలో ప్రేమికుల రోజును నిషేధించారు. కారణం అడగగా వాలంటైన్స్ డే ఇస్లాంకు వ్యతిరేకమన్నది అక్కడి అధికారుల సమాధానం. ముస్లింల జనాభా అధిక సంఖ్యలో ఉండే ఇండోనేషియాలోనూ దీనిపై వ్యతిరేకత ఉంది.
మలేషియాలోనూ ప్రేమ పండుగను విచిత్రంగా ప్రతిఘటిస్తున్నారు. ప్రేమ చిహ్నాలు, ఎమోజీలను వాడవద్దని అక్కడి ముస్లిం యువకుల సంఘం మహిళలను అభ్యర్థించి... పెర్ఫ్యూమ్ కూడా ఎక్కువ మోతాదులో వాడొద్దంటూ సూచిస్తారు.