vaikunta ekadasi in telangana : తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. యాదాద్రిలో లక్ష్మీ సమేత నారసింహుడు.. భక్తులకు ఉత్తర ద్వార దర్శనమిచ్చాడు. ఆలయ పునర్నిర్మాణం లో భాగంగా నలుదిక్కుల గోపురాలు నిర్మించడంతో ఆలయ చరిత్రలో తొలిసారి స్వామి వారు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిచ్చారు. భక్తుల నరసింహ నామస్మరణతో ఆలయ తిరువీధులు మార్మోగుతున్నాయి. మంత్రులు జగదీశ్ రెడ్డి,ఇంద్రకరణ్ రెడ్డిలతో పాటు ఎమ్మెల్యే గొంగిడి సునిత, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఉన్నతాధికారులు స్వామివారిని ఉత్తరద్వారం ద్వారా దర్శించుకున్నారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. మేళ్లచెరువు మండల కేంద్రంలోని శ్రీ స్వయంభూ శంభు లింగేశ్వర స్వామి ఆలయానికి వేకువజామునుంచే భారీగా తరలివచ్చిన భక్తులు..స్వామివారిని దర్శించుకున్నారు.
vaikunta ekadasi in Bhadradri : భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. రామయ్యను ఉత్తర ద్వార దర్శనం చేసుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. రామనామ స్మరణలు, మంగళ వాయిద్యాల నడుమ ఉత్తర ద్వారం తలుపులు తెరవడంతో భక్తులు స్వామివారిని దర్శించుకుని తన్మయత్వానికి లోనయ్యారు.
vaikunta ekadasi in Kaleshwaram : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి అనుబంధ ఆలయమైన శ్రీ రామాలయం, మందరగిరి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వేకువజామునుంచే భక్తులు తరలివచ్చారు. స్వామి వారికి ప్రత్యేక అభిషేకం, పూజల అనంతరం ఆలయ అర్చకులు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు.
మహదేవపూర్ లోని మందరగిరి స్వయం భూ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు కనుల పండువగా జరిగాయి. మూలవిరట్టుకు పంచామృత అభిషేకం, విశేష పూజలు చేశారు. వరంగల్‌లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. బట్టల బజార్లోని శ్రీ బాలానగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిచ్చారు. హనుమకొండ జిల్లా పరకాల పరిధిలోని వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా వైష్ణవ ఆలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. భక్తులు దేవుడిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఆలయాలు వైకుంఠ శోభను సంతరించుకున్నాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో వైకుంఠ ఏకాదశి ని ఘనంగా నిర్వహించారు. ఉత్సవమూర్తులను ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.