Vaikunta Ekadashi 2023 at Jiyaguda Ranganatha Swamy Temple :వైకుంఠ ఏకాదశి అనగానే భక్తులకు ఠక్కున గుర్తువచ్చేది.. తిరుమల. ఆ పవిత్రమైన రోజున కలియుగ ప్రత్యక్షదైవం వెంకటేశ్వరస్వామిని ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకోవాలని భక్తులు ఆరాటపడుతారు. ఇలా దర్శించుకున్న వారికి పునర్జన్మ ఉండదని, మోక్షం సిద్ధిస్తుందని వేదవాక్కు. అందుకే.. భక్తులు పెద్దఎత్తున తిరుపతి వెళ్లడానికి సిద్ధమవుతుంటారు. అయితే.. తిరుమలలో ఏ విధంగానైతే వైకుంఠ ఏకాదశి(Vaikunta Ekadashi 2023) వేడుకలు నిర్వహిస్తారో అదే తరహాలో హైదరాబాద్ సమీపంలోని జియాగూడ రంగనాథ స్వామి ఆలయంలోనూ అంతే వైభవంగా జరుగుతాయి. ఇంతకీ ఈ ఆలయ విశిష్టత ఏంటి? పురాణాలు ఏం చెబుతున్నాయి? ఈ టెంపుల్లో వైకుంఠ ద్వార దర్శనం ఎప్పుడు కల్పించనున్నారు? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
ఆలయ చరిత్ర, విశిష్టత..
హైదరాబాద్‌లోని పురాతన దేవాలయాలలో జియాగూడ రంగనాథస్వామి దేవాలయం ఒకటి. ఈ ఆలయం సుమారు 400 సంవత్సరాల నాటిదని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ ఆలయాన్ని మూసీ నది ఒడ్డున రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో ద్రవిడ శైలిలో రాతితో నిర్మించారు. ఈ టెంపుల్ మూడు అంచెల రాజగోపురం కలిగి ఉంది. దేవాలయ గర్భగుడిలో రాతితో చెక్కిన శేషతల్పంపై సేదతీరుతున్న విష్ణువు అవతారుడైన శ్రీ రంగనాథస్వామి దర్శనమిస్తారు. అలాగే ఆంజనేయస్వామి, గరుడదేవుడు, లక్ష్మీదేవి (రంగనాయకి), అండాల్ అనే దేవతామూర్తుల ఆలయాలు ఉన్నాయి. గరుడ మందిరం వెనుకవైపు పంచలోహాలతో తయారుచేసిన ధ్వజస్తంభం ఉంది. గర్భగుడిపైన విష్ణుమూర్తి దశావతార చిత్రాలు చాలా చక్కగా చెక్కారు.
Vaikunta Ekadashi Speciality : వైకుంఠ ఏకాదశి విశిష్టత ఏంటీ.. పురాణాలు ఏం చెబుతున్నాయి..?