కొవిడ్ డెల్టా వేరియంట్ ముప్పు నుంచి తప్పించుకోవడానికి టీకా తీసుకోవడమే మార్గమని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ బిజినెస్ డెవలప్‌మెంట్ హెడ్ డాక్టర్ రేచస్ ఎల్ల అన్నారు. డెల్టా వేరియంట్ ఎంతో ప్రమాదకరమైనది, ఎంతో వేగంగా వ్యాప్తి చెందుతున్నందున, అప్రమత్తత ఎంతో ముఖ్యమని అన్నారాయన. ‘కొవిడ్-19, వ్యాక్సినేషన్- ద నెక్ట్స్ వేవ్’ అంశంపై శుక్రవారం ఆస్కి (అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా), ఎఫ్‌టీసీసీఐతో కలిసి ఫిక్కీ తెలంగాణ రాష్ట్ర విభాగం నిర్వహించిన వెబినార్‌లో డాక్టర్ రేచస్ ఎల్ల మాట్లాడారు. టీకా తీసుకుంటే తీవ్రమైన కొవిడ్-19 ముప్పు నుంచి తప్పించుకోగలమని, ఆస్పత్రి పాలయ్యే అవసరం దాదాపుగా ఉండదని ఆయన పేర్కొన్నారు.
టీకానే కాదు.. జాగ్రత్తలు అవసరమే..
రెండు డోసుల టీకా తీసుకున్న వారిలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని, శరీరంలో యాంటీ బాడీలు వృద్ధి చెందుతాయని వివరించారు. అదే సమయంలో వ్యాధి రాకుండా అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు పాటించటం తప్పనిసరన్నారు. సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులార్ బయాలజీ (సీసీఎంబీ) డైరెక్టర్ డాక్టర్ వినయ్ కే.నందికూరి మాట్లాడుతూ డెల్టా, గామా రకం కరోనా వైరస్ కొవిడ్-19 వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో కనిపించకపోవచ్చని, ‘రెండో దశ’లో ఇదే జరిగిందని పేర్కొన్నారు. త్వరగా టీకా కార్యక్రమాన్ని పూర్తి చేయడం, సామాజిక దూరం పాటించడంతో పాటు అన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కొవిడ్-19 మూడో దశ ముప్పు తప్పించుకునే అవకాశం ఉంటుందని వివరించారు.
డెల్టా వేరియంట్ రెండో దశలో కనిపించదు..
తెలంగాణ కొవిడ్ టాస్క్‌ఫోర్స్ సభ్యుడు, నిమ్స్ ఆసుపత్రి నెఫ్రాలజీ విభాగాధిపతి డాక్టర్ టి.గంగాధర్ స్పందిస్తూ, కరోనా మొదటి దశ 8 నెలలు ఉంటే, గరిష్ఠంగా ఒక రోజులో లక్ష కేసులు నమోదయ్యాయన్నారు. రెండోదశ 4 నెలలు ఉండగా.. అత్యధికంగా రోజుకు 4 లక్షల కేసులు వచ్చాయని అన్నారు. ఎంతో వేగంగా వ్యాప్తి చెందే డెల్టా వేరియంట్ రెండో దశలో కనిపించిందని తెలిపారు. ముందస్తు వ్యాధులున్న వారికి కొవిడ్-19 సోకితే, చికిత్సలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా కేన్సర్ వ్యాధిగ్రస్తులకు మరింత అప్రమత్తత అవసరమని బెంగళూరులోని సైట్‌కేర్ హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్- డైరెక్టర్ (హీమటో ఆంకాలజీ) డాక్టర్ హరి మీనన్ అన్నారు.
భవిష్యత్తు సవాళ్లకు సిద్ధం కావాలి..
ముందస్తు వ్యాధులు ఉన్న వారు టీకా తీసుకుంటే కొవిడ్ బారిన పడినప్పటికీ ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చని అభిప్రాయపడ్డారు. గతానుభవాలను దృష్టిలో పెట్టుకుని, భవిష్యత్తు సవాళ్లకు సిద్ధం కావాలని ఆస్కిలోని సెంటర్ ఫర్ హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సుబోధ్ కందముథన్ పేర్కొన్నారు. టీకా కార్యక్రమాన్ని సత్వరం పూర్తిచేయడమే మూడో దశ ముప్పునకు పరిష్కారమని ఆస్కి డైరెక్టర్ జనరల్ డాక్టర్ నిర్మల్ బాగ్చి అభిప్రాయపడ్డారు. కరోనా ముప్పును తప్పించుకోడానికి సమాజంలోని అన్నివర్గాలు ఉమ్మడిగా కృషి చేయాలని ఎఫ్‌టీసీసీఐ అధ్యక్షుడు కె.భాస్కరరెడ్డి సూచించారు.
ఇదీ చూడండి:Villages Merged: విలీనం చేసినా తప్పని తిప్పలు.. తాగునీటి కోసం అవస్థలు