రాష్ట్రంలో టీకాల పంపిణీ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. ప్రభుత్వ, ప్రైవేటు వైద్యంలో రోజుకు సగటున 1.50 లక్షల డోసులను అందజేస్తున్నారు. తాజా గణాంకాలను పరిశీలిస్తే.. ఈనెల 5న 1,58,258 డోసులను పంపిణీ చేశారు. ఇందులో ప్రభుత్వ వైద్యంలో 1,29,243 డోసులు కాగా.. ప్రైవేటులో 29,015 అందజేశారు. రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడిన అర్హులైన టీకా లబ్ధిదారులు 2.20 కోట్ల మంది ఉండగా.. వీరిలో 1,15,24,621 మందికి తొలిడోసును, 38,21,469 మందికి రెండో డోసును అందించారు. ఇంకా ఇదే వయస్సు ఒక్క డోసూ పొందనివారు 1.05 కోట్ల మంది ఉంటారని వైద్యశాఖ అంచనా. నవంబరులో తొలిడోసు పూర్తయితే.. ఇప్పుడున్న నిబంధనల ప్రకారం కొవాగ్జిన్ అయితే నెల తర్వాత రెండో డోసును, అదే కొవిషీల్డ్‌కు మూణ్నెల్ల వరకూ ఆగాలి. ఈ ప్రకారం డిసెంబరు-ఫిబ్రవరి నెలల వరకూ రెండో డోసు ప్రక్రియ కొనసాగుతుంది.
ఏడాది చివరి నాటికి పూర్తే లక్ష్యం
రాష్ట్రంలో ఇప్పటివరకూ అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 24.63 లక్షల మంది టీకాలు పొందారు. ఇందులో 8.32 లక్షల మంది రెండో డోసు పొందారు. రెండో స్థానంలో రంగారెడ్డి జిల్లాలో 15.53 లక్షల మందికి తొలిడోసు వేయగా.. వీరిలో 4.85 లక్షల మంది రెండో డోసు స్వీకరించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా టీకాల పంపిణీలో మూడో స్థానంలో ఉంది. ఇక్కడ తొలి డోసును 14.91 లక్షల మందికి వేయగా.. రెండో డోసును 4.90 లక్షల మందికి వేశారు. రాష్ట్రంలో అర్హులైన లబ్ధిదారులకు డిసెంబరు నాటికే రెండు డోసులు పూర్తయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నాం. కేంద్రం కూడా డిసెంబరు నాటికి అందరికీ టీకా వేసేలా కార్యాచరణ రూపొందించింది.